Telangana: వినియోగదారులపై సర్దు‘బాదుడు’.. మోత మోగనున్న విద్యుత్ ఛార్జీలు!

15 Feb, 2023 07:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ)ను వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు కసరత్తు ప్రారంభించాయి. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు అమల్లోకి రానుండగా వినియోగదారులపై మాత్రం జూలైలో అందుకొనే బిల్లుల్లో ఈ చార్జీల ప్రభావం కనిపించనుంది. ఒక నిర్దిష్ట నెలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ఆ తర్వాతి మూడో నెలలో వసూలు చేయాల్సి ఉండటమే దీనికి కారణం.

ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలకు అనుమతిస్తూ గత నెల 18న రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ప్రకటించిన ‘మూడో సవరణ నిబంధన, 2023’ను నోటిఫై చేస్తూ అదే నెల 20న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఈ నెల 12న రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు మార్గం సుగమనమైంది. దీంతో ప్రజలపై విద్యుత్‌ బిల్లులు మరింత భారంగా మారనున్నాయి.  

కేంద్రం ఆదేశాల నేపథ్యంలో..
ఇంధన/విద్యుత్‌ కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గుల భారాన్ని ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల రూపంలో ఆటోమెటిక్‌గా విద్యుత్‌ బిల్లుల్లో బదిలీ చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్‌ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్‌ కాస్ట్‌ డ్యూ టు ఛేంజ్‌ ఇన్‌ లా) రూల్స్‌ 2021ను ప్రకటించింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో పెరిగిపోతున్న విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. దీని ఆదారంగానే ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతిచి్చంది. ఈఆర్సీ ప్రకటించిన ప్రత్యేక ఫార్ములా ఆధారంగా ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను లెక్కించి వసూలు చేయనున్నారు. 

యూనిట్‌పై 30 పైసల దాకా వడ్డన 
యూనిట్‌ విద్యుత్‌కి గరిష్టంగా 30 పైసల వరకు ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ఈఆర్సీ అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. ఒకవేళ ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు యూనిట్‌కి 30 పైసలకు మించితే అనుమతి లేకుండా ఆపైన ఉండే అదనపు చార్జీలు విధించడానికి వీల్లేదు. 30 పైసల సీలింగ్‌కి మించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు వసూలు చేయాల్సి వస్తే ఈఆర్సీ నుంచి అనుమతి పొందాలి.

ఒకవేళ ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను లెక్కించాక రుణాత్మకంగా తేలితే ఆ మేరకు ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను వినియోగదాలకు రిఫండ్‌ చేయాలి. ఎల్టీ–5 కేటగిరీలోని వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల వినియోగదారులపై ఈ చార్జీలు విధించనున్నారు. వ్యవసాయ వినియోగదారుల ఇంధన సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉండనుంది. ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను లెక్కించే సమయంలో ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ నష్టాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు.  

45 రోజుల్లోగా పత్రికల్లో ప్రకటన..
నిరీ్ణత కాల వ్యవధిలోపు ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను విధించడంలో డిస్కంలు విఫలమైతే తర్వాతి కాలంలో వసూలు చేసేందుకు అనుమతి ఉండదు. నెలవారీ ఇంధన సర్దుబాటు చార్జీలను నిబంధనల ప్రకారం డిస్కంలు లెక్కించి సంబంధిత నెల ముగిసిన 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది. విద్యుత్‌ బిల్లుల్లో ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతోపాటు వసూలైన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేస్తారు.

ప్రతి త్రైమాసికం ముగిశాక 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి సమరి్పంచాలి. డిస్కంలు విధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించనుంది. 

ఇక ట్రూఅప్‌ ప్రతిపాదనలు కీలకం.. 
ఏటా నవంబర్‌ ముగిసేలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)తోపాటు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వివరాలు, ట్రూఅప్‌ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. ముందే వసూలు చేసిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను పరిగణనలోకి తీసుకొని ట్రూఅప్‌ చార్జీల రూపంలో వినియోగదారులకు పంచాల్సిన లాభనష్టాలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ట్రూఅప్‌ ప్రతిపాదనలు సమరి్పంచే వరకు ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతించదు.
చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ప్రేయసి హ్యాండ్‌ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా?

>
మరిన్ని వార్తలు