బకాయిలపై న్యాయ పోరాటమే!

11 Sep, 2022 02:04 IST|Sakshi

ఏపీకి రూ.6,756 కోట్లు చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలతో తెలంగాణ నిర్ణయం  

ఆ రాష్ట్రం నుంచే రూ.17,828 కోట్లు రావాలంటున్న విద్యుత్‌ సంస్థలు 

పెన్షన్‌ ట్రస్టు ఫండ్‌ బకాయిలపై హైకోర్టులో పిటిషన్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణల మధ్య విద్యుత్‌ బకాయిల అంశంపై న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు నిర్ణయించాయి. ఏపీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.6,756.92 కోట్లను నెలరోజుల్లో ఏపీ జెన్‌కోకు చెల్లించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

ఏపీ విద్యుత్‌ సంస్థల నుంచి తెలంగాణకు రూ.17,828 కోట్లు రావాల్సి ఉందని.. దీనిని కేంద్రం పట్టించుకోలేదని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు మండిపడుతున్నాయి. దీనిపై ఈ నెల 3న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిరసన తెలిపినట్టు గుర్తుచేస్తున్నాయి. కేంద్ర సహకారం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు చెబుతున్నాయి. 

ఆరేళ్లుగా పెన్షన్‌ ట్రస్ట్‌ వివాదం 
రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్‌ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ ట్రస్ట్‌లో జమచేసి ఉన్న నిధుల పంపకాలు జరగలేదు. రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్లు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీకి సంబంధించిన నిధులను విద్యుత్‌ సంస్థలు ఈ ట్రస్టులో జమ చేసేవి. విభజన నాటికి ట్రస్టులో దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు నిల్వ ఉండగా.. ట్రస్ట్‌ నిర్వహణ ఏపీకి వెళ్లింది.

విద్యుత్‌ వివాదాల నేపథ్యంలో ఆరేళ్ల కింద ఈ ట్రస్టు నుంచి తెలంగాణకు చెల్లింపులను ఏపీ నిలిపివేసింది. దీంతో రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్ష న్లు, గ్రాట్యుటీ, ఈఎల్‌ మొత్తాలను తెలం గాణ విద్యుత్‌ సంస్థలు సొంత నిధుల నుంచే చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి రావాల్సిన పెన్షన్‌ ట్రస్ట్‌ బకాయిలను ఇప్పించాలని విద్యుత్‌ సంస్థలు తాజాగా హైకోర్టు ను ఆశ్రయించాయి. ఇక ఈ వివాదాల కారణంగా విద్యుత్‌ సంస్థలు పెన్షన్‌ ట్రస్ట్‌లో నిధులు జమ చేయడం లేదని.. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపు ఇబ్బందికరంగా మారుతుందని ఉద్యోగ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు