పీఆర్సీ కోసం ఉద్యమాలు ఉధృతం

21 Feb, 2023 03:17 IST|Sakshi

కార్యాచరణను ప్రకటించిన విద్యుత్‌ జేఏసీ  

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ సాధన కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ప్రకటించింది. 1004 యూనియన్‌ కార్యాలయంలో సోమవారం సమావేశమై ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన నోటీసులను యాజమాన్యానికి అందజేసినట్లు జేఏసీ చైర్మన్‌ జి.సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీ విషయంలో యాజమాన్యం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యాచరణలో భాగంగా ఈనెల 21, 22 తేదీల్లో సర్కిల్‌ స్థాయిల్లో సమావేశాలు, 24, 25, 28 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మార్చి 1, 2న డివిజన్‌ కార్యాలయాలు, జనరేటింగ్‌ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 3, 4న సర్కిల్‌ కార్యాలయాలు, కార్పొరేట్‌ కార్యాలయాలు, జనరేటింగ్‌ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 8 నుంచి 23 వరకు సర్కిల్‌ కార్యాలయాలు, కార్పొరేట్‌ కార్యాలయాలు, జనరేటింగ్‌ స్టేషన్ల వద్ద రిలే నిరాహార దీక్షలు, మార్చి 14న కేటీపీఎస్‌ ప్లాంట్‌ వద్ద, 17న వరంగల్‌లో, 21న శంషాబాద్‌లో నిరసన సభలు, 24న విద్యుత్‌ సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయినా, యాజమాన్యం స్పందించని పక్షంలో 24న అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్‌ శ్రీధర్, కో కన్వీనర్, బీసీ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ వజీర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు