పీస్‌ మిషన్‌ ఆపడం వల్లే కాంగ్రెస్‌ మట్టి కొట్టుకుపోయింది: కేఏ పాల్‌

9 May, 2022 01:16 IST|Sakshi

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): తన పీస్‌ మిషన్‌ ఆపడం వల్లే దేశంలో కాంగ్రెస్‌ మట్టి కొట్టుకుపోయిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో జరిగిన సభకు కాంగ్రెస్‌ పార్టీ రూ.87 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ నాన్న, నాన్నమ్మ, తాతయ్యలు దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టారని, కానీ, వారెప్పుడైనా రైతుల గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

ఇప్పుడు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అంటూ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. దేశాన్ని సోనియాగాంధీ ఇటలీకి ఎప్పుడో అమ్మేశారని ఆరోపించారు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని,  తనను చంపాలని చూస్తున్నారని, ఒక్క కేఏ పాల్‌ చస్తే తన లాంటి పాల్‌లు నలుగురు పుడతారన్నారు. ఖబడ్దార్‌ కేసీఆర్, కేటీఆర్‌..తనతో పెట్టుకుంటే వారికే ఇబ్బందని హెచ్చరించారు. ప్రజాసేవ చేయాలనుకునే వారు తన పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు