‘ప్రాణహిత’కు పోటెత్తిన భక్తజనం 

15 Apr, 2022 04:21 IST|Sakshi
అర్జునగుట్ట వద్ద ప్రాణహిత తీరంలో భక్తజనం 

భూపాలపల్లి/కాళేశ్వరం/కోటపల్లి/వేమనపల్లి: ప్రాణహిత పుష్కరాలకు రెండోరోజు భక్తజనం పోటెత్తారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాణహిత నదీతీరం భక్తులతో కిటకిటలాడాయి. గురువారం సెలవు రోజు కూడా కావడంతో తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, కేరళ నుంచి భక్తులు తరలివచ్చారు.

పుష్కర స్నానాలతోపాటు కాళేశ్వర ముక్తీశ్వరులను లక్షమంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లి, తుమ్మిడిహెట్టి పుష్కరఘాట్లలో రద్దీ కనిపించింది. కాగా, ప్రాణహిత పుష్కరాలకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసి, సౌకర్యాలు కల్పించడంతో మన రాష్ట్రం నుంచి భక్తులు మహారాష్ట్రలోని సిరొంచ, నగురం ఘాట్‌లకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. మహారాష్ట్రలోని పుష్కరఘాట్లలో 2.5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 

మరిన్ని వార్తలు