ముగిసిన ‘పుష్కరం’.. భక్తజన పునీతం 

25 Apr, 2022 04:32 IST|Sakshi
ప్రాణహిత నదీ తీరంలో భక్తుల కోలాహలం   

కౌటాల(సిర్పూర్‌)/కోటపల్లి(చెన్నూర్‌)/కాళేశ్వరం: ప్రాణహిత నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు ఆదివారం పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఈనెల 13న ప్రాణహిత పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇటు కుమురంభీం జిల్లా తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లితోపాటు అటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమ పుష్కరఘాట్లలో ఈ పన్నెండు రోజుల్లో దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించారు.

అలాగే కాళేశ్వరాలయాన్ని 10 లక్షల మంది భక్తులు సందర్శించారు. ఆలయానికి వివిధ పూజలు, లడ్డూ ప్రసాదాల రూపేణా రూ.70లక్షల ఆదాయం సమకూరినట్లు అంచనా. కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో పన్నెండు రోజులు పన్నెండు హారతులిచ్చారు. ఆదివారం తుమ్మిడిహెట్టి వద్ద 108 యజ్ఞకుండాతో శివసంకల్ప మహాయజ్ఞం నిర్వహించారు. కాశీ నుంచి వచ్చిన వేదపండితులు నదికి ముగింపు హారతినిచ్చారు.  

మరిన్ని వార్తలు