బడులు.. మడులు.. బడుగులు బారెడు పద్దు

8 Mar, 2022 02:18 IST|Sakshi

రూ.2.56 లక్షల కోట్లతో 2022–23 బడ్జెట్‌

బడ్జెట్‌ 22–23

దళిత బంధుకు 17,700 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి కలిగేలా ‘దళిత బంధు’పథకానికి రూ.17,700 కోట్లను ఈసారి బడ్జెట్‌లో కేటాయించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. అందులో భాగంగానే సొంతంగా స్థలమున్న పేదలు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు.

రైతు బీమా తరహాలో నేతన్నలకు కూడా రూ.5 లక్షల బీమా సౌకర్యం, లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై మోటార్‌ సైకిళ్లు ఇచ్చే పథకాలకు శ్రీకారం చుట్టారు. వీటితోపాటు వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి శాఖలకు కూడా భారీగా నిధులు కేటాయించారు. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆసరా పింఛన్లు, వడ్డీ లేని రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, శిశు సంక్షేమం తదితర పథకాలు, విభాగాలకు గణనీయంగా కేటాయింపులు చేశారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో.. కుటుంబాలకు, వ్యక్తులకు నేరుగా లబ్ధి కలిగే పథకాలను ప్రభుత్వం ప్రకటించిందని ఆర్థిక, రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.

విద్య, వైద్య రంగాలకూ ప్రాధాన్యం
తొలి నుంచీ చర్చ జరుగుతున్న విధంగానే.. ఈసారి విద్య, వైద్య రంగాలకూ బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు. కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.1,000 కోట్లను కేటాయించారు. మన ఊరు–మన బడి కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 వేల కోట్లకుపైగా కేటాయించారు. ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స పొందే రోగులకు డైట్‌ చార్జీలను పెంచడంతోపాటు హైదరాబాద్‌లోని 18 మేజర్‌ ఆస్పత్రులకు వచ్చే రోగుల సహాయకులకు సబ్సిడీపై భోజన సదుపాయాన్ని కొత్తగా కల్పించారు.

తద్వారా రోజుకు 18,600 మందికి లబ్ధి కలుగుతుందని పేర్కొన్న ప్రభుత్వం.. ఇందుకోసం రూ.38.66 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బస్తీ దవాఖానాలను.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా విస్తరించేలా కొత్తగా 60 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. కొత్తగా మహిళా విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రతిపాదిస్తూ.. చెరో రూ.100 కోట్లను కేటాయించారు.

పాలమూరు, డిండి పూర్తిచేస్తాం..
తాజా బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లకుపైగా ప్రతిపాదించారు. కృష్ణానదిపై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. మరో ముఖ్య ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీ విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. రూ.50వేలలోపు ఉన్న రైతుల రుణాలు ఈ నెలలో మాఫీ అవుతాయని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.

వృద్ధాప్య పింఛన్ల కోసం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని.. ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు రూ.2,750 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. అయితే నిరుద్యోగ భృతిని మాత్రం బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు. మొత్తంగా ప్రాధాన్య రంగాలకు కేటాయింపులు తగ్గకుండా చూసుకోవడంతోపాటు.. ప్రస్తుత సంక్షేమ పథకాల అమలు, కొత్తగా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టడం, దళితబంధుకు భారీ నిధులు వంటివి ఈసారి బడ్జెట్‌లో ముఖ్యాంశాలుగా హరీశ్‌రావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు