ప్రైవేట్‌ టీచర్లకు నగదు సాయమేది..!

4 Jul, 2021 07:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మంచిర్యాల: ప్రైవేట్‌ విద్యాసంస్థ బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందించే నగదు సాయంలో జాప్యం జరుగుతోంది. కరోనా అపత్కాలం కింద ఉపాధ్యాయులు, సిబ్బందికి రూ.2వేల ఆర్థిక సాయం, 25 కిలోల సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్‌ నుంచి ప్రతీ నెల 20 నుంచి 22లోపు సాయం అందిస్తోంది. జూన్‌లో బియ్యం పంపిణీ చేసినా నగదు సాయం బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. జూలై నెల ప్రారంభమైనా రాకపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదురు చూడకతప్పడం లేదు. తొలివిడతలో 2115, మలివిడతలో 1500 మందికి ఈ సాయాన్ని అందిస్తూ వచ్చారు.

తొలివిడతలో యూడైస్‌లో పేర్లు నమోదై ఉన్నవారికి మాత్రమే దక్కడంతో మిగిలిన వారిలో ఆందోళన మొదలైంది. బ్యాంకుల అనుసంధానంతో ఐఎఫ్‌ఎస్‌ నెంబర్లు మారడం.. కొందరు రేషన్‌కార్డు, దుకాణం నంబర్ల నమోదులో తప్పులు దొర్లడంతో సాయానికి దూరం కావాల్సి వచ్చింది. దీంతో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు సవరణలు చేసి డీఈవో కార్యాలయంలో అందజేశారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన అధికార యంత్రాంగం డైస్‌లో నమోదు కానీ ప్రైవేట్‌ ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వానికి నివేదించడంతో మిగిలిన వారందరికీ రెండో విడత సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రకటించింది.

అప్పటి నుంచి 25 కిలోలు, రూ.2వేల నగదు అందుతోంది. ప్రస్తుతం రోజులు గడుస్తున్నా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జూన్‌ నెలకు బియ్యం పంపిణీ చేసి నగదు రూ.2వేలు అందజేయకపోవడంపై ప్రైవేట్‌ ఉపాధ్యాయ, సిబ్బందిలో నిరాశ నెలకొంది. అధికారులు  చోరవ తీసుకుని ప్రత్యక్ష బోధన జరిగే వరకు ఈసాయం అందించాలని కోరుతున్నారు. 

అపత్కాల భృతి అందించాలి 
కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ప్రకటించిన అపత్కాల భృతి జూన్‌ నెలకు సంబంధించి రూ.2వేల నగదు ఉపాధాయులు, సిబ్బంది ఖాతాలో జమకాలేదు. ప్రభుత్వ సాయం రాకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అధికారుల తప్పిదం వల్ల చాలమంది ప్రీప్రైమరీ ఉపాధ్యాయులు, డ్రైవర్లు, క్లీనర్లకు ఇప్పటివరకు అపత్కాల భృతి రాలేదు. మిగిలిన వారికి కూడా ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.        

– రాపోలు విష్ణువర్థన్‌రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు

ఆర్థిక సాయం అందించాలి 
ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సిబ్బందికి పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే వరకు అపత్కాల భృతి అందించాలి. మూడు నెలలకు సంబంధించి బియ్యం సకాలంలో అందించి, నగదు రూ.2వేలు రెండు నెలలు చెల్లించి, జూన్‌ మాసం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రభుత్వం అందించే సాయం క్రమం తప్పకుండా అందించి ఆదుకోవాలి. 

– సుజాత, ఉపాధ్యాయురాలు   

చదవండి: ఏపీలో విద్య.. మహోన్నతం 

మరిన్ని వార్తలు