ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రూటే సెపరేటు..అనుమతులు ఒకలా.. ప్రయాణం మరోలా..

5 Jun, 2022 18:18 IST|Sakshi

ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌

ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న వైనం.. 

బస్సుల భద్రతపై అనుమానాలు..

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రైవేటు ట్రావెల్స్‌ అడ్డదారిలో జిల్లా ప్రయాణికులను తరలించుకుపోతూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. కాంటాక్టు క్యారియర్‌ అనుమతులు ఉన్న బస్సులు ఇలా మధ్య, మధ్యలో ఆపి ప్రయాణికులను తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ నుంచి జిల్లా మీదుగా నిత్యం రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు స్టేజ్‌ క్యారియర్‌ అనుమతి లేకున్నా.. ఆదిలాబాద్‌లో నిలిపి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్స్‌ బస్సులపై చర్య తీసుకోవాల్సిన ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. 

జిల్లా కేంద్రం మీదుగా ఆదిలాబాద్‌–హైదరాబాద్, రాయ్‌పూర్‌ – హైదరాబాద్, నాగ్‌పూర్‌ – బెంగళూరు మధ్య అనేక ప్రైవేట్‌ బస్సులు నడుస్తాయి. ఆరెంజ్, జీడీఆర్, ఎస్‌ఆర్‌ఎస్, శబరి, దివాకర్, ఖురానా అనే ట్రావెల్‌ బస్సులు ఇతర ప్రాంతాల నుంచి బయలుదేరి ఆదిలాబాద్‌ మీదుగా గమ్య స్థానానికి వెళ్తాయి. ఇవే కాకుండా ఆదిలాబాద్‌ నుంచి నిత్యం ముస్కాన్, మెట్రో, డైమండ్, పల్లవి, సహరా స్థానిక ట్రావెల్స్‌ ఏజెన్సీల నుంచి హైదరాబాద్‌కు రాత్రి సర్వీసులు నడుస్తాయి. కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి వద్ద ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురై దగ్ధమైంది. ఈ ఘటనలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. వారంతా హైదరాబాద్‌ వాసులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపింది. ప్రైవేట్‌ బస్సుల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ద్వారా వందలాది మంది ప్యాసింజర్లు గమ్యస్థానాలకు     వెళ్తున్నారు. 

లాగేజీ దందా.. 
కాంటాక్టు క్యారియర్‌ అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘిస్తూ స్టేజ్‌ క్యారియర్‌గా బస్సులను నడుపుతుండడమే కాకుండా ఈ ట్రావెల్స్‌ ఏజెన్సీ నిర్వాహకులు పార్శిల్, లగేజీ దందాను అక్రమంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చిపోయే బస్సులు పెద్ద మొత్తంలో పార్శిల్, లగేజీ నిర్వాహణ చేపడుతున్నాయి. వస్తు సామగ్రిని ఒక చోట నుంచి మరోచోటకి బస్సుల ద్వారా తరలించే అనుమతి వీరికి లేకపోయినా యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్యాసింజర్లను చేరవేయడం ద్వారా ట్రావెల్‌ ఏజెన్సీలకు అనుకున్న స్థాయిలో లాభాలు ఉండవని, అసలు పార్శిల్, లగేజీలు చేరవేయడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ బస్సుల ద్వారా వస్తుసామగ్రి చేరవేత రూపంలో అనేక అక్రమ దందాలు కూడా కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది వ్యాపారులు డబ్బులను హవాలా రూపంలో చేరవేస్తారనే ప్రచారం కూడా ఉంది. పెద్ద మొత్తంలో లగేజీని బస్సుల బాక్స్‌లతోపాటు టాప్‌పై తీసుకొస్తుండడంతో ఎదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ లగేజీ కారణంగా ప్రమాద తీవ్రత పెరుగుతుంది. దీనిపై ఇటు పోలీసు, అటు రవాణా శాఖ అధికారుల నిఘా లేకపోవడం వారికి కలిసి వస్తోంది. 

భద్రత డొల్లా.. 
ప్రస్తుతం ప్రైవేట్‌ బస్సులు స్లీపర్‌ కోచ్‌లను తీసుకురావడం జరిగింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సీటింగ్‌ విధానంతో బస్సు లోపల స్థలం ఇరుకుగా మారింది. ఎదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులు ఒకరికి దాటుకుని మరొకరు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మరణాల సంఖ్య పెరుగుతుంది. సాధారణంగా కాంటాక్టు క్యారియర్‌ అనుమతి ఉన్నవారు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకిస్తారు. దానికి విరుద్ధం స్టేజ్‌ క్యారియర్‌ అనుమతి లేకున్నప్పటికీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సును నడపడమే కాకుండా మధ్యమధ్యలో బస్సును ఆపి ప్రయాణికులను చేరవేయడం నిబంధనలకు విరుద్దం. కానీ ఇవన్నీ యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

మరిన్ని వార్తలు