ఒక బస్సు..రెండింతలజనం, కొండగట్టును మరిచారా?

30 Jun, 2021 02:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోమవారం.. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో 75 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) నమోదైంది. మంగళవారం 68 శాతంగా రికార్డయింది. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత బస్సులు మళ్లీ కళకళలాడుతున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో జనం ప్రయాణాలకు ముందుకొస్తున్నారు. బస్టాండ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం, సాయం త్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. అందుబాటు లో ఉన్న బస్సులన్నీ రోడ్డుపైకి తెచ్చినా చాలటం లేదు. గత్యంతరం లేక డిపోల్లో మూలకు చేరిన డొక్కు బస్సులను అప్పటికప్పుడు మరమ్మతులు చేయించి వాడుకోవాల్సి వస్తోంది. వీటిల్లో కొన్ని మధ్యలోనే మొరాయిస్తుండటంతో సిబ్బంది, ప్రయాణికులు నెట్టాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అవి కూడా సరిపోక, ఒక్కో బస్సులో రెండు బస్సులకు సరిపడా ప్రయాణికులను కుక్కి పంపుతున్నారు. అధికారులు డిపోల్లో నిలబడి మరీ బస్సుల్లోకి జనాన్ని ఎక్కిస్తున్నారు.


 
ఎందుకీ పరిస్థితి....? 
ఆర్టీసీకి సొంతంగా 6,370 బస్సులున్నాయి. నిధులు లేక చాలాకాలంగా కొత్త బస్సులు కొనటం లేదు. ఏటా 400 బస్సులు తుక్కుగా మారుతుంటాయి. వాటి స్థానంలో కొత్త బస్సులు కొనాలి. కానీ కొన్నేళ్లుగా కొత్త బస్సుల్లేక ఆర్టీసీ సొంత బస్సులు తగ్గిపోయాయి. దీంతో నిబంధనలను సడలించి మరీ అద్దె బస్సులు తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 3,170 బస్సులు అద్దె ప్రాతిపదికనే నడుస్తున్నాయి. అయితే అసలే నష్టాలు, ఆపై కోవిడ్‌ కష్టాలతో అద్దె బస్సు నిర్వాహకులకు రూ.100 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. లాక్‌డౌన్‌ తర్వాత అద్దె బస్సుల వాడకాన్ని ఆర్టీసీ నిలిపేయడంతో.. 3,170 బస్సులు అందుబాటులో లేక ఇప్పుడీ కష్టాలు చుట్టుముట్టాయి. చేతిలో సొంత నిధులు లేకపోవటం, ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినా బ్యాంకు రుణాలు చేతికందకపోవటం, ప్రభుత్వం ఇచ్చే మొత్తం జీతాలకే వాడేస్తుండటం వల్ల అద్దె బస్సుల వినియోగానికి వీల్లేకుండా పోయింది. ఫలితంగా ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు.

కొండగట్టును మరిచారా? 
2018లో 102 మందితో కిక్కిరిసి ప్రయాణిస్తున్న బస్సు కొండగట్టు వద్ద బ్రేకులు ఫెయిలై దొర్లిపడిపోయి 50 మందికిపైగా దుర్మరణం చెందారు. అది ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపటంతో.. ఇక సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది. ఇప్పుడు స్వయంగా ఆర్టీసీ అధికారులే దాన్ని ఉల్లంఘించి దగ్గరుండి మరీ ఎక్కువ మందిని బస్సుల్లోకి ఎక్కిస్తున్నారు. ‘ప్రస్తుతం మాకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. అద్దె యజమానులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని వీలైనంత త్వరగా ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు