Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరానికి వరద పోటు

15 Jul, 2022 02:58 IST|Sakshi

నీట మునిగిన లక్ష్మి, సరస్వతి పంపుహౌస్‌లు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి గోదావరి వరద

గోదావరి నుంచి చందనాపూర్‌ వాగులోకి వెనక్కి తన్నిన ప్రవాహం

వాగు ఉప్పొంగి నీట మునిగిన సరస్వతి (అన్నారం) పంపుహౌస్‌.. 12 పంపులు

గోదావరి, ప్రాణహితల నుంచి లక్ష్మి బ్యారేజీ (మేడిగడ్డ)కి 28 లక్షల క్యూసెక్కుల అతి భారీ వరద

ఒత్తిడిని తట్టుకోలేక లక్ష్మి పంపుహౌస్‌ బ్రెస్ట్‌ వాల్‌కు గండ్లు

లోపలికి వెళ్లిన నీళ్లు.. మునిగిన 17 పంపులు

మోటార్లు, ప్యానెల్‌ బోర్డు, స్కాడా పరికరాలూ నీట మునక

వరద నీటిని తోడేశాకే నష్టాలపై స్పష్టత వచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌/కాళేశ్వరం/మంథని/ మోపాల్‌: కనీవినీ ఎరుగని రీతిలో గోదావరికి వచ్చిన భారీ వరద కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రభావం చూపింది. ప్రాజెక్టు పరిధిలోని సరస్వతి (అన్నారం), మేడిగడ్డ (లక్ష్మి) పంపుహౌస్‌లు పూర్తిగా నీట మునిగాయి. పంపుహౌస్‌లలోని పంపులు, మోటార్లు, ప్యానెల్‌ బోర్డు, విద్యుత్‌ పరిక రాలూ నీట మునిగాయి. ఇంకా భారీగా వరద కొనసాగుతున్న నేపథ్యంలో పంపుహౌస్‌లలో నీటిని తోడేసే అవకాశం లేదని.. నీటిని తోడేస్తేనే నష్టంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.

వాగులో నీళ్లు వెనక్కి తన్ని..
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు సమీపంలోని సరస్వతి (అన్నారం) పంపుహౌస్‌ను వరద ముంచెత్తింది. ఇక్కడ సరస్వతి బ్యారేజీ దిగువన చందనాపూర్‌ వాగు గోదావరిలో కలుస్తుంది. అయితే గోదావరిలో భారీ వరదతో వాగు ప్రవాహం వెనక్కి తన్నడంతో.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో చందనాపూర్‌ వాగు పోటెత్తింది. సరస్వతి పంపుహౌజ్‌కు, వాగుకు మధ్య రక్షణగా ఉన్న ఇసుక కరకట్టపై నుంచి ప్రవాహం పొంగి.. పంపుహౌజ్‌లోకి ప్రవేశించింది. కొద్దిగంటల్లోనే పంపుహౌజ్‌ పూర్తిగా నీట మునిగింది. 12 పంపులతోపాటు స్కాడా వ్యవస్థ, కంట్రోల్‌ ప్యానెళ్లు, స్టార్టర్లు సహా ఎలక్ట్రికల్‌ పరికరాలన్నీ మునిగిపోయాయి. దీనితో నష్టం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గరిష్టంగా 100 మీటర్ల వరదను తట్టుకునేలా వీలుగా అన్నారం పంపుహౌజ్‌ను డిజైన్‌ చేయగా.. అనూహ్యంగా 113 మీటర్ల వరద పోటెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. పంపుహౌజ్‌ వద్ద విధి నిర్వహణలో ఉన్న 120 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

లక్ష్మి పంపుహౌస్‌ గోడకు గండ్లు
గోదావరి వరద ఉధృతి భారీగా ఉండటంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కన్నెపల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) పంపుహౌస్‌ కూడా నీట మునిగింది. గోదావరి ప్రధాన నదిలో 16 లక్షల క్యూసెక్కులు, ప్రాణహిత నుంచి మరో 12 లక్షల వరద కలిసి.. ఏకంగా 28 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం రావడంతో పంపుహౌజ్‌పై ఒత్తిడి పెరిగింది. 106.7 మీటర్ల వరదను తట్టుకునేలా పంపుహౌజ్‌ను డిజైన్‌ చేయగా, 108 మీటర్లకుపైగా వరద రావడంతో.. పంపుహౌస్‌ అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి భారీగా వరద సర్జ్‌పూల్‌లోకి చేరింది. సర్జ్‌పూల్‌లోని ఫోర్‌బే, పంపుహౌస్‌కు మధ్య ఉండే కాంక్రీట్‌ గోడ (బ్రెస్ట్‌ వాల్‌) ఒత్తిడికి గురై గండ్లు పడ్డాయి. దీనితో పంపుహౌజ్‌లోని 17 పంపులు పూర్తిగా నీటమునిగాయి.

కంట్రోల్‌ రూంలో ఉన్న కంట్రోల్‌ ప్యానెళ్లు, స్కాడా ఆపరేటింగ్‌ సిస్టం, ప్రొజెక్టర్లు, ఏసీలు, ఇతర విలువైన ఎలక్ట్రిక్‌ సామగ్రి, రెండు లిఫ్ట్‌లు నీటితో నిండాయి. నిజానికి అధికారులు బుధవారం రాత్రి నుంచి పంపుహౌస్‌లోకి వస్తున్న వరదను ఆపడం కోసం మోటార్లు నడిపించేందుకు సిద్ధమ య్యారు. కానీ భారీ వర్షాలతో అన్నారం నుంచి వచ్చే 220 కేవీ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో మోటార్లను నడిపించలేకపోయారు. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడానికి ట్రాన్స్‌కో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆలోగా పంపుహౌజ్‌ పూర్తిగా నీట మునిగింది. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21, 22లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం బైరాపూర్‌ శివారులో నిర్మిస్తున్న గడ్కోల్‌ పంపుహౌస్‌లోకి కూడా వరద నీరు చేరింది.

1986 నాటి వరదను తట్టుకునేలా నిర్మాణం: శ్యాంప్రసాద్‌రెడ్డి
మునిగిన పంపుహౌస్‌లలో నీటిని తొలగించి అన్ని పరికరాలను పరీక్షించాకే వాస్తవ నష్టాన్ని అంచనా వేయగలమని రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 1986లో వచ్చిన వందేళ్ల గరిష్ట వరదను తట్టుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్‌ చేసినా..అంతకు మించిన వరద రావడంతో పంపులు నీటమునిగాయని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు