బీసీల అభివృద్ధి విధాన ప్రకటన చేయాలి: కృష్ణయ్య 

2 Jul, 2022 01:40 IST|Sakshi
జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌. కృష్ణయ్య 

కాచిగూడ (హైదరాబాద్‌): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీసీల అభివృద్ధి కోసం బీసీ డిక్లరేషన్‌ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శుక్రవారం కాచిగూడలోని అభినందన్‌ గ్రాండ్‌లో కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి పట్ల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి పార్టీ విధాన ప్రకటన చేయాలన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బీసీ వ్యతిరేక ప్రభుత్వమని పేరుందని, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య విన్నవించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు, లాల్‌కృష్ణ, కోల జనార్దన్, రవీందర్, చంద్రశేఖర్, జయంతిగౌడ్, వంశీకృష, విజయ, రజిత, మహేశ్, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు