ఆదివాసీలపై దాడులు అమానుషం: రాహుల్‌

10 Jul, 2022 01:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆదివాసీలపై, ప్రత్యేకంగా తమ భూమి హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్న మహిళలను ప్రభుత్వం అణచివేయడం అమానుషమని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలోని కోట్లాది ప్రజల ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ ఏర్పడిందని, ఆదివాసీ హక్కుల పరిరక్షణ అందులో ఒక ముఖ్య భాగమని ఆయన గుర్తుచేశారు.

మంచిర్యాలతో పాటు ఇతర జిల్లాల్లో పోడుభూముల వ్యవహారంలో జరుగుతున్న దాడులను ఆయన శనివారం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా ఖండించారు. ఆదివాసీ గొంతును నొక్కేందుకు పోలీసు బలగాలతో అణచివేయడం అన్యాయమని, పోడు భూమి పట్టాలను అర్హులైన ఆదివాసీలకు బదలాయిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ వెంటనే వెనక్కి తగ్గి ప్రజలకు ద్రోహం చేశారని రాహుల్‌ ఆరోపించారు. ‘జల్‌–జంగల్‌–జమీన్‌’ రక్షణ కోసం వారి పోరాటంలో, తమ ఆదివాసీ సోదర సోదరీమణులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. రాహుల్‌గాంధీ ట్వీట్‌ ద్వారా ఆదివాసీల ఉద్యమాన్ని ప్రస్తావించడం, వారికి మద్దతు ప్రకటించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు