ప్యాసింజర్‌ రైళ్లకు.. మరో 2 వారాలు బ్రేక్‌!

2 Nov, 2021 04:11 IST|Sakshi

కోవిడ్‌ కేసుల సంఖ్య పెరగకుంటేనే గ్రీన్‌సిగ్నల్‌

మళ్లీ పునరాలోచనలో రైల్వేబోర్డు

మూడో దశ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో ఎదురుచూసే ధోరణి

కేసులు పెరిగితే మరికొంతకాలం అవి షెడ్లకే పరిమితం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ రెండో దశ పూర్తిగా తగ్గినందున ఇక అన్ని రైళ్లను ప్రారంభించాలని యోచిస్తున్న సమయంలో రైల్వేను మూడో దశ హెచ్చరికలు తిరిగి పునరాలోచనలో పడేశాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మూడో దశపై వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో అక్టోబర్‌ చివరి నాటికి అన్ని రకాల రైళ్లను పునరుద్ధరించాలన్న నిర్ణయంతో ఉన్న రైల్వే బోర్డు మళ్లీ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలు ఒకరింటికి మరొకరు వెళ్లి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఒకవేళ కోవిడ్‌ మూడో దశ మొదలైనట్టయితే.. ఈ వేడుకల మాటున కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దీపావళి తర్వాత రెండు వారాల పాటు ఎదురు చూసి అప్పటి పరిస్థితికి తగ్గట్లు రైళ్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వైరస్‌ బారిన పడ్డవారికి చేరువుగా మెలిగినవారిలో రెండు వారాల్లో లక్షణాలు వెలుగుచూసే అవకాశం ఉన్నందున అప్పటి వరకు ఎదురు చూడాలన్న యోచనలో రైల్వే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్యాసింజర్‌ రైళ్లు పట్టాలెక్కటమనేది దీనిపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. 

పట్టాలెక్కని ప్యాసింజర్‌ రైళ్లు..
దక్షిణమధ్య రైల్వే పరిధిలో 250 ప్యాసింజర్‌ రైళ్లు నిత్యం పరుగుపెడుతుంటాయి. కోవిడ్‌ నేపథ్యంలో 2020 మార్చి చివరలో మొదటిసారి లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఆగిన ఈ రైళ్లు ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు దశలవారీగా ప్రారంభమై దాదాపు గరిష్ట స్థాయిలో నడిపారు. మళ్లీ రెండో దశలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు కొంతకాలం అవి నిలిచిపోయినా.. మళ్లీ ఆ తర్వాత ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దాదాపు అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి.

ఇక దాదాపు 15 నెలలపాటు షెడ్లకే పరిమితమైన హైదరాబాద్‌ సిటీ ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా పరిమిత సంఖ్యలో ప్రారంభమై దశలవారీగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో మొత్తం 121 ఎంఎంటీఎస్‌ రైళ్లు ఉండగా, ప్రస్తుతం 60 రైళ్లు నడుస్తున్నాయి. వీటి సంఖ్య పెంచుతూ ఇక ప్యాసింజర్‌ రైళ్లకు కూడా పచ్చజెండా ఊపొచ్చని గత నెలలో నిర్ణయించారు. కానీ, వారం రోజులుగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీపావళి ముగిసిన తర్వాత కొన్ని రోజులు పరిస్థితిని గమనించిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చన్న అభిప్రాయాలు రైల్వే వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి.

అయితే, అన్ని ప్యాసింజర్‌ రైళ్లు నిలిచిపోయేలా ఉన్నా... వాటిలోంచి 50 రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా నడుపుతుండటం విశేషం. వీటి స్టాపుల సంఖ్య తగ్గించి, అన్‌ రిజర్వ్‌డ్‌ సీట్లకు బదులు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల తరహాలో టికెట్లు జారీ చేస్తూ నడుపుతున్నారు. తదుపరి రైల్వే బోర్డు నిర్ణయం తీసుకునే వరకు.. అన్ని స్టాపుల్లో ఆగుతూ, అతి తక్కువ టికెట్‌ ధరతో ప్రయాణించే వెసులుబాటు ఉండే ప్యాసింజర్‌ రైళ్లు ఎక్కే అవకాశం లేనట్లే.  

మరిన్ని వార్తలు