మూడేళ్లు.. 76 వేలు

7 Dec, 2021 01:59 IST|Sakshi

కేన్సర్‌ మరణాల్లో 13వ స్థానంలో తెలంగాణ

రాష్ట్రంలో గత మూడేళ్లలో 76,234 మంది మృతి

దేశవ్యాప్తంగా 13.92 లక్షల కేసులు.. 7.70 లక్షల మరణాలు

జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులే ప్రధాన కారణం

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేన్సర్‌ మరణాలు ఏటా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో తెలంగాణలో ఏకంగా 76,234 మంది కేన్సర్‌తో మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు కేన్సర్‌పై ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం కేన్సర్‌ మరణాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 13వ స్థానంలో నిలిచింది. నేషనల్‌ కేన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌ రిపోర్ట్‌–2020, ఇండియన్‌ కౌన్సిల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) కేన్సర్‌ రిజిస్ట్రీ డేటా ప్రకారం 2018–2020 మధ్య దేశంలో కేన్సర్‌ మరణాలు గణనీయంగా పెరిగాయి.

2020లో దేశంలో 13.92 లక్షల కేన్సర్‌ కేసులు నమోదవగా 7.70 లక్షల మంది మరణించారు. అందులో అత్యధికంగా యూపీలో 1.11 లక్షల మంది కన్నుమూయగా ఆ తర్వాత మహారాష్ట్రలో 63,797 మంది మృతిచెందారు. అతితక్కువగా లక్షద్వీప్‌లో 13 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది.

పొగాకు ఉత్పత్తుల వాడకంతో... 
వివిధ రకాల వ్యాధులు, వృద్ధాప్య జనాభా, మారిన జీవనశైలి, పొగాకు ఉత్పత్తుల వాడకం, అనారోగ్యకరమైన ఆహారం, వాయుకాలుష్యంతో కేన్సర్‌ వ్యాధులు ఏటా పెరుగుతున్నాయి. కేన్సర్‌పై అవగాహన కోసం జాతీయ కేన్సర్, మధుమేహ, హ్రుద్రోగ వ్యాధులు, స్ట్రోక్‌ నివారణ, నియంత్రణ కార్యక్రమానికి (ఎన్‌పీసీడీసీఎస్‌) కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కింద మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, మానవవనరుల అభివృద్ధి, ఆరోగ్యంపై అవగాహన, కేన్సర్‌ నివారణ కోసం చైతన్యం తీసుకురావడం, రోగనిర్ధారణ, నిర్వహణ వంటివి చేయాలని నిర్ణయించింది. 

ఈశాన్యంలో తక్కువే... 
ఈశాన్య రాష్ట్రాల్లో కేన్సర్‌ కేసులు సంఖ్య చాలా తక్కువ ఉండటానికి అక్కడి ప్రజల జీవన విధానమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా సిక్కిం, మేఘాలయాలలో వ్యవసాయ భూముల్లో రసాయనాలు, పురుగుమందులు వాడరు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగు చేస్తారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రైవేటు ఆసుపత్రులు కూడా పెద్దగా ఉండవని అంటున్నారు. 

విద్యాసంస్థల ఆవరణలో పొగాకు ఉత్పత్తులు నిషేధించాలి.. 
కేన్సర్‌ కేసుల నమోదు, మరణాలకు ప్రధాన కారణాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకం ఒకటి. కాబట్టి పొగాకు ఉత్పత్తుల వాడకంపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. యువత పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్నారు. దీన్ని నివారించేందుకు విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాలి. కేన్సర్‌పైనా అవగాహన కల్పించాలి. స్క్రీనింగ్‌ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాలి. వ్యవసాయ భూముల్లో రసాయనాలు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలి.     


– శిరీష, పొగాకు నియంత్రణ ఉద్యమ కార్యకర్త, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు