కుక్క కాటుకు వ్యాక్సిన్‌ కొరత..

12 Dec, 2022 05:24 IST|Sakshi

రేబిస్‌ మరణాల్లో నాలుగో స్థానం 

తెలంగాణలో పది నెలల్లో 21 మంది మృతి 

అత్యధికంగా కర్ణాటకలో 32 మరణాలు 

వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్‌ వ్యాధితో సంభవిస్తున్న మరణాలు తెలంగాణలో గణనీయంగా ఉన్నాయి. ఇటువంటి మరణాల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ మధ్య 21 మంది రేబిస్‌ వ్యాధితో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా వెల్లడించింది.

అత్యధికంగా కర్ణాటకలో 32 మంది ఈ కాలంలో మరణించగా, తర్వాత పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో 24 చొప్పున, తమిళనాడులో 22, కేరళ, తెలంగాణల్లో 21 చొప్పున రేబిస్‌ మరణాల కేసులు నమోదయ్యాయి. జాతీయ రేబిస్‌ నియంత్రణ కార్యక్రమం దేశం మొత్తం అమలవుతున్నా రేబిస్‌ మరణాలు సంభవించడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.  వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశించింది.

వ్యాక్సిన్‌ కొరత... : రాష్ట్రంలో అనేక ఆస్పత్రుల్లో కుక్క కరిచిన తర్వాత జరగాల్సిన చికిత్సకు అవసరమైన మందులు లేవనే చెప్పాలి. అధికార లెక్కల ప్రకారమే కుక్కకాటు వల్ల దాదాపు 40 వేల మందికిపైగా ఆస్పత్రులపాలవుతున్నట్లు వెల్లడైంది. ఇక విచక్షణారహితంగా కరిచే పిచ్చికుక్కలను పట్టి దూరంగా వదిలివచ్చే శిక్షణ కలిగిన సిబ్బంది కొరత కూడా తీవ్రంగానే ఉంది. మున్సిపల్‌ అధికారులు ఏదో నామమాత్రంగా పిచ్చికుక్కలు, వీధికుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్నా ఆచరణకు వచ్చే సరికి కాగితాలకే మిగిలిపోతున్నాయి.

రేబిస్‌ నిరోధక టీకాలు కొనుగోలు, సరఫరా అంతా ఒక మిథ్యగా మారిపోతోంది. కోట్లాది రూపాయలు వ్యయం చేసి కొంటున్నట్లు చెప్తున్నా మందులు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. అలాగే కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రణ చేసే కార్యక్రమం కూడా నామమాత్రంగా మారింది. శునకాలకు శస్త్రచికిత్స చేస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్నా అవి ఎంతవరకు వాస్తవం అనేది అగమ్యగోచరంగానే ఉంది. వీధి కుక్కలకు వచ్చిన జబ్బులకు చికిత్సచేసే విధానం అయితే లేదనే చెప్పొచ్చు.  

మరిన్ని వార్తలు