Telangana: వాటాలు తేల్చుకుందాం!

30 Aug, 2021 03:08 IST|Sakshi

1న జరిగే సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం 

వినిపించాల్సిన వాదనలపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం 

అన్నిరకాల నివేదికలతో సిద్ధమైన రాష్ట్ర ఇంజనీర్లు 

సెప్టెంబర్‌ 2న ఢిల్లీలో కేంద్రమంత్రులతో చర్చించనున్న ముఖ్యమంత్రి  

సాక్షి, హైదరాబాద్‌:  కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ సిద్ధమయ్యింది. సెప్టెంబర్‌ ఒకటిన జరిగే కృష్ణా బోర్డు పూర్తిస్థాయి భేటీలో వినిపించాల్సిన వాదనలపై కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు అదేరోజున కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త భేటీకి హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక దఫాలుగా ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, న్యాయనిపుణులతో చర్చించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. బోర్డుల ముందు ఏఏ అంశాలను ప్రస్తావించి, ఎలాంటి వాదనలు విన్పించాలనే విషయమై అంశాల వారీగా మార్గదర్శనం చేశారు. ఆయన సూచనలు, సలహాల మేరకు ఇంజనీర్లు అన్ని నివేదికలు సిద్ధం చేశారు. ఇక సెప్టెంబర్‌ 2న ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి.. పలువురు కేంద్ర మంత్రులను కలిసి నదీ జలాల సంబంధిత అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.  

వాటాలు పెంచుకోవడంపైనే దృష్టి 
రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచి కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి పెరగాల్సిన వాటాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటినే ఏపీ, తెలంగాణలు తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో వాడుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి నీటి వాటాలను మార్చాలని తెలంగాణ గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా, నీటి వాటాలు మాత్రం మొత్తం కేటాయింపుల్లో 35 శాతం మేర మాత్రమే ఉన్నాయని.. పరీవాహకాన్ని, ఆయకట్టును పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని, బోర్డును కోరుతోంది. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే మొత్తం 811 టీఎంసీల నికర జలాల కేటాయింపుల్లో సగం వాటా అంటే 405.5 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్‌ కేటాయింపులు జరిపేదాకా వినియోగించుకోవాలని సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో నిర్ణయించారు.

బుధవారం జరిగే కృష్ణా పూర్తి స్థాయి భేటీలోనూ ఈ మేరకు బలంగా వాదనలు వినిపించాలని, అవసరమైన అన్ని నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీ తరలించే 80 టీఎంసీల గోదావరి నీటితో, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కే 45 టీఎంసీల వాటాను ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ రాబట్టుకునేలా వ్యూహరచన చేశారు. దీనికి తోడు క్యారీఓవర్‌ నీటిపై ఏపీ చేస్తున్న వాదనను తిప్పికొట్టేందుకు, తాగునీటి కేటాయింపులో 20 శాతం వినియోగమే లెక్కలోకి తీసుకునేలా రాష్ట్ర వాదనను బలంగా వినిపించేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. ఏపీ అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం లక్ష్యంగా నివేదికలు రూపొందించారు.  

గెజిట్‌పై చర్చకు రెడీ 
కేంద్రం వెలువరించిన కృష్ణా, గోదావరి గెజిట్‌ నోటి ఫికేషన్‌ అమలుకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ, అత్యవసర సమావేశాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్న తెలంగాణ.. ఈసారి వైఖరి మార్చుకుంది. వచ్చేనెల 1వ తేదీన జరిగే సంయుక్త భేటీకి హాజరవ్వాలని నిర్ణయించింది. గెజిట్‌లోని అభ్యం తరకర అంశాలను సమావేశం దృష్టికి తీసుకురావడంతో పాటు ఇతర విషయాల్లో తామందించబో యే సహకారాన్ని వివరించనుంది. రాష్ట్రంలో అను మతి లేని ప్రాజెక్టులపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. 

మూడ్రోజులు ఢిల్లీలో మకాం 
ఇలావుండగా సెప్టెంబర్‌ 2న ఢిల్లీకి వెళుతున్న సీఎం.. మూడ్రోజుల పాటు అక్కడే ఉండనున్నట్టు సమాచారం. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో పాటు ఇద్దరు, ముగ్గురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. నదీజలాల వివాద చట్టం సెక్షన్‌–3 కింద కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుతో కృష్ణా జలాల పునఃపంపిణీ చేసే అంశంపై షెకావత్‌కు విన్నవించే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్రం కోరుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ఆయా ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతులు త్వరగా ఇవ్వాల్సిందిగా ఆయన కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గెజిట్‌లోని అభ్యంతరకర అంశాలపై స్పష్టత కోరనున్నట్లు తెలిపాయి.   

మరిన్ని వార్తలు