రియల్‌ బూమ్‌.. జోరుగా రిజిస్ట్రేషన్లు

24 Apr, 2021 03:03 IST|Sakshi

కరోనా ఉధృతిలోనూ తగ్గని లావాదేవీలు

ఈ నెలలో ఇప్పటివరకు 75 వేల లావాదేవీలు

ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటివరకు రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా 75,236 లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.382.64 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. దీంతోపాటు రూ.200 కోట్లు ఈ చలాన్ల రూపంలో వచ్చాయి. కరోనా మన రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందు సాధారణంగా రోజుకు 4-5 వేల వరకు రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిగేవి. ఈ నెలలో వచ్చిన సెలవులను మినహాయిస్తే దాదాపు అదే స్థాయిలో లావాదేవీలు జరిగాయి.

ఎప్పుడు ఏమవుతుందో?
కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరగడానికి మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారేమోననే ఆందోళనే కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాక ఏ క్షణమైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌ పెట్టే అవకాశముందని రియల్టర్లు, కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మార్కెట్‌ విలువల సవరణ ప్రక్రియ కూడా రియల్‌ లావాదేవీలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనుకుంటున్న ప్రభుత్వం.. కచ్చి తంగా మార్కెట్‌ విలువలను పెంచుతుందనే అభిప్రాయం రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో ఉంది. ఏప్రిల్‌ 1 నుంచే మార్కెట్‌ విలువల పెంపు అమల్లోకి వస్తుం దనే ప్రచారం కూడా జరిగింది.

ఈ నేపథ్యంలో మళ్లీ మార్కెట్‌ విలువలు పెరిగితే ఆ మేరకు రిజిస్ట్రేషన్‌ ఫీజు పడుతుందనే ఆలోచనతోనే హడావుడిగా రిజిస్ట్రేషన్లకు వెళ్లాల్సి వస్తోందని రియల్‌ వ్యాపారులు చెబుతున్నారు. అలాగే రియల్‌ ఎస్టేట్‌ రంగం మళ్లీ పుంజుకోవడం కూడా లావాదేవీలు పెరిగేందుకు కారణమని రిజిస్ట్రేషన్ల అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు క్రయ, విక్రయ లావాదేవీల నిమిత్తం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుండడంతో అన్ని రకాల కోవిడ్‌ నిబంధనలను రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తోంది. ముఖ్యంగా ఫొటో క్యాప్చరింగ్‌ సమయంలో మాస్కులు తీయాల్సి ఉన్నందున ఆ విభాగంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.400 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చిన నేపథ్యంలో ఈ నెలలో మిగిలిన పనిదినాల్లో జరిగే లావాదేవీల ఆధారంగా మరో రూ.100 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది.

చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్‌
చదవండి: రియల్‌ బూమ్‌.. జోరుగా రిజిస్ట్రేషన్లు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు