దంచికొడుతున్న వానలు

24 Jul, 2020 01:41 IST|Sakshi

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు 

జగ్గాసాగర్, బచ్చోడుల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు 

ఈ సీజన్లో ఇప్పటివరకు 35 శాతం అధిక వర్షం 

నేడు కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం 

సాక్షి, హైదరాబాద్ ‌: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో గురువారం పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వికారాబాద్‌ జిల్లాలో కొన్ని గ్రామాలు నీటమునగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాండూరు పట్టణంలోని తాండూరు–హైదరాబాద్‌ రోడ్డు మార్గం చెరువును తలపించింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో 7 సెంటీమీటర్లు, కోరుట్ల మండలం అల్లాపూర్, మెట్‌పల్లిల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. శుక్రవారం కూడా ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 

గద్వాల జిల్లాలో అధిక వర్షపాతం..
ఈ సీజన్‌లో జూన్‌ ఒకటో తేదీ నుంచి గురువారం వరకు రాష్ట్రంలో 35 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఈ తేదీల మధ్య సాధారణంగా రాష్ట్రం లో 297.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావా ల్సి ఉండగా, ఇప్పటివరకు ఏకంగా 401.2 మిల్లీమీటర్లు రికార్డు అయిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 134 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇదే అధికమని పేర్కొంది. సాధారణంగా ఈ కాలంలో ఇక్కడ 166.5 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా.. 390.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో సాధారణ వర్షపాతం 206 మిల్లీమీటర్లకుగాను 127 శాతం అధికంగా 467.4 మిల్లీమీటర్లు నమోదైంది. మొత్తంగా 22 జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, 10 జిల్లాలో సాధారణ వర్షపాతం రికార్డయి నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్‌ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. 

రాజధానిలో ఎడతెరిపిలేని వాన 
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ తడిసి ముద్దయ్యింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా జడివాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై నడుము లోతున వరదనీరు పోటెత్తింది. నగరంలో సరాసరిన 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించింది.  

మరిన్ని వార్తలు