ఈ యాసంగిలో రికార్డుకెక్కిన వరిసాగు

8 Apr, 2021 09:40 IST|Sakshi

సాధారణం కంటే 137 శాతం అధికం

 ఆశించిన స్థాయిలోనే సగటు దిగుబడులు

1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా

మొదలైన వరి కోతలు... అత్యధికం దొడ్డురకమే

గోడౌన్లు, మిల్లులన్నీ ఇప్పటికే వానాకాలం ధాన్యంతో ఫుల్‌

ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వానికి సవాలే..

సాక్షి, వరంగల్‌: విస్తారంగా వానలు.. నిండుకుండల్లా జలాశయాలు.. మత్తడి దుంకిన చెరువులు, కుంటలు.. పొలాలకు సమృద్ధిగా జలాలు.. భూమికి పచ్చాని రంగేసినట్టు పచ్చదనం... ఆకట్టుకున్న ప్రాజెక్టుల ఆయకట్టులు.. కాళేశ్వరం, దేవాదుల, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్‌ తదితర ప్రాజెక్టుల నీరు బిరబిరా కాల్వల్లో పరుగులు... ఫలితంగా రాష్ట్రంలో వరిసాగు రెండింతలైంది. వరికంకులు కొత్త చరిత్ర సృష్టించాయి. 2020– 21 యాసంగిలో మొత్తం పంటల అంచనా 36,43,770 ఎకరాలు కాగా, 68,14,555(187.02 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. వరిసాగు అంచనా 22,19,326 ఎకరాలు కాగా.. అనూహ్యంగా 52,78,636 (237.85 శాతం) ఎకరాల్లో సాగైంది. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు 1,47,80,181 టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని అంచనా. అయితే ఇప్పటికే రైసుమిల్లులు, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములు వానాకాలం ధాన్యంతో నిండిపోయాయి. ఈసారి  యాసంగి పంట కొనుగోళ్లు సవాల్‌గా మారనున్నాయి. 

137 శాతం అధికంగా వరిసాగు
గత యాసంగి, ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి పంటలు దండిగా రానున్నాయి. అంచనాలకు మించి 137 శాతం అధికంగా వరి సాగైంది. ఒకదశలో ఈ యాసంగి ధాన్యం కోనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతుల్లో అలజడి చెలరేగడంతో మళ్లీ వెనుకడుగు వేసింది. యాసంగి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ తాజాగా వెల్లడించారు. గతేడాది యాసంగిలో 38,62,510 ఎకరాల్లో వేస్తే ఈసారి 14,16126 ఎకరాల్లో అదనంగా సాగు చేశారు.  వరంగల్‌ రూరల్‌ జిల్లాలో సాగు అంచనా 43,710 ఎకరాలు కాగా, 1,19,682 ఎకరాల్లో వరివేశారు. నిజామాబాద్‌లో 1,92,616 ఎకరాలకుగాను 3,87,628, మహబూబ్‌నగర్‌ 29,415కుగాను 1,21,004, కరీంనగర్‌లో 1,21,853కుగాను 2,64,609, జగిత్యాలలో 1,32,648కుగాను 2,98,283, పెద్దపల్లిలో 1,13,520 ఎకరాలకుగాను 1,97,741 ఎకరాల్లో వరివేశారు. మొత్తంగా ఈ ఏడు 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 

గోదాములే సమస్య
రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వరి విస్తీర్ణం 52.78 లక్షల ఎకరాలకు చేరిన నేపథ్యంలో 6,408 కొనుగోలు కేంద్రాలను 31 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 2,131 ఐకేపీ, 3,964 పీఏసీఎస్‌(ఫా్యక్స్‌), 313 ఏఎంసీ, ఇతర కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయనున్నారు. ప్రస్తుత సీజన్‌కు కూడా కామన్‌ రకం క్వింటాకు రూ.1,868, ‘ఏ’గ్రేడ్‌ రకానికి చెందిన ధాన్యం క్వింటాకు రూ.1,888గా కనీసమద్దతు ధర(ఎంఎస్‌పీ) చెల్లిం చనున్నారు.  ఇంతవరకు బాగానే ఉన్నా వానాకాలం ధాన్యంతో రైసుమిల్లులు, గోదాములు నిండుకుండల్లా మార డం ప్రతిబంధకం కావచ్చని మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తవి, పాతవి కలిపితే 21.99 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణవ్యాప్తంగా 2,210 రైస్‌ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి లక్షల టన్నుల బియ్యం తయారు చేస్తాయి. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కానీ, ఈసారి సగం మిల్లుల్లో వానాకాలం ధాన్యం, బియ్యం నిల్వలు ఫుల్‌గా ఉన్నాయి. 

2020–21 యాసంగి సాగు వివరాలు (ఎకరాల్లో)

► యాసంగిలో మొత్తం పంటల అంచనా-36,43,770
► ఈ ఏడాది యాసంగి సాగు-68,14,555
► మొత్తంగా సాగు శాతం    -187.02
► గతేడాది యాసంగి సాగు-52,22,377

► అత్యధికంగా పంటలు సాగైన జిల్లా-వరంగల్‌ రూరల్‌ (299.10 శాతం)
► అత్యల్పంగా పంటలు సాగైన జిల్లా-ఆసిఫాబాద్‌ కొమురం భీం (128.95 శాతం)
► రాష్ట్రంలో వరిసాగు అంచనా(ఎకరాల్లో)-22,19,326
► ఈ యాసంగి సాగు-52,78,636
► మొత్తంగా వరిసాగు శాతం- 237.85 
► దిగుబడి అంచనా-1,47,80,181     (దొడ్డు రకం 1.19 కోట్ల టన్నులు +    టన్నులు
► సన్నాలు 28.80 లక్షల టన్నులు)
► గతేడాది సాగు-38,62,510
► యాసంగి కొనుగోళ్లు ఇలా
► మొత్తం కొనుగోలు కేంద్రాలు-6,408
► ఐకేపీ కేంద్రాలు-2,131
► పీఏసీఎస్‌ (ఫా్యక్స్‌) కేంద్రాలు-3,964
► ఏఎంసీ, ఇతర కేంద్రాలు-313

కనీస మద్దతుధర (ఎంఎస్‌పీ)
► ‘ఏ’గ్రేడ్‌ (క్వింటాకు)-రూ.1,888
► కామన్‌ రకం (క్వింటాకు)-రూ.1,868

ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు
యాసంగిలో రైతులు అధికమొత్తంలో దొడ్డురకం వరిధాన్యం సాగు చేశారు. అక్కడక్కడ మాత్రమే సన్నరకం వరి వేశారు.  ఈ యాసంగిలో వరి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని గుర్తించాం. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కసరత్తు పూర్తయింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేసి  మిల్లులకు తరలించేందుకు అనుమతుల కోసం లేఖ రాశాం. 
– రాఘవేందర్, డీఎం, జయశంకర్‌ భూపాలపల్లి 

ఈసారి కొంత ఎక్కువ దిగుబడి 
పోయినసారి కన్నా ఈసారి కొంత ఎక్కువ దిగుబడి వచ్చింది. పోయిన యాసంగిల ఎకరానికి 23 క్వింటాళ్లు వస్తే, పోయిన వానాకాలంల కేవలం 18 క్వింటాళ్లే వచ్చాయి. ఈసారి అధికారులు 28 అంటున్రుగాని సుమారు  26 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. 
– ఎండపెల్లి శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, కమలాపూర్, వరంగల్‌ అర్బన్‌ జిల్లా 

ఇప్పటికైతే మంచిగానే ఉంది
ఎన్నో ఏళ్లుగా ఎవుసాన్ని నమ్ముకొని బతుకుతున్న. మూడు, నాలుగేళ్లుగా ఎవుసం చేస్తె అప్పులే తప్ప గవ్వ మిగులలేదు. వానాకాలం పంట చేతికి వచ్చే సమయానికి వాన నిండా ముంచింది. యాసంగి పంట దిగుబడి ఇప్పటికైతే మంచిగానే ఉంది. కోసే దాక వానలు కొట్టకపోతే ఎకరానికి 25 క్వింటాళ్ల దాక వడ్లు చేతికి వస్తయ్‌.
 – డొంగరి రాజయ్య, రైతు, కాటారం,  జేఎస్‌ భూపాలపల్లి జిల్లా

మరిన్ని వార్తలు