రింగ్‌కు అటూ ఇటూ హైదరాబాద్‌ సిటీ

15 Dec, 2021 21:38 IST|Sakshi

జలవనరుల ఆధారంగా రీజినల్‌ రింగురోడ్డు అలైన్‌మెంట్‌

ఆర్‌ఆర్‌ఆర్‌కు వెలుపల గజ్వేల్, జగదేవ్‌పూర్, వలిగొండ, యాదాద్రి  

సంగారెడ్డి, తూప్రాన్, నర్సాపూర్, చౌటుప్పల్‌లు రింగు లోపలే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రభుత్వం నిర్మించనున్న రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) కొత్త అలైన్‌మెంట్‌ ప్రకారం కొన్ని పట్టణాలు రింగురోడ్డు లోపల, మరికొన్ని పట్టణాలు దాని వెలుపల ఉండనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న జలవనరులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు, ఇతర నీటి కాలువల ఆధారంగా ఈ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు.  

యాదాద్రిని దాటిద్దామనుకున్నా.. 
యాదగిరిగుట్ట దేవాలయం ఈ రీజినల్‌ రింగు రోడ్డు లోపలి వైపు ఉండేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని ప్రభుత్వం భావించినా ఇక్కడ బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం జరగనున్న నేపథ్యంలో దానికి నీటిని అందించే కాళేశ్వరం నీటి కాలువకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. తాజా అలైన్‌మెంట్‌ ప్రకారం యాదాద్రికి దాదాపు 4 కి.మీ. దూరం నుంచే రోడ్డు నిర్మాణం జరగనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారి నుంచి యాదాద్రికి వెళ్లే రాయగిరి రోడ్డు మొదలయ్యే చోట, భువనగిరి పట్టణం బైపాస్‌ రోడ్డు ముగిసే ప్రాంతానికి చేరువగా ఆర్‌ఆర్‌ఆర్‌ క్రాస్‌ కానుంది. ఇది భువనగిరి పట్టణానికి చేరువగా ఉండనుంది. అంటే భువనగిరి పట్టణం రీజనల్‌ రింగురోడ్డు లోపలివైపు ఉండనుండగా యాదాద్రి టెంపుల్‌ టౌన్‌ మాత్రం దీనికి ఆవల ఉండనుంది. బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు సమీపంలోని తుర్కపల్లి పట్టణం మాత్రం రింగురోడ్డు లోపలివైపే ఉండనుంది.

తుర్కపల్లి నుంచి యాదాద్రికి నిర్మిస్తున్న నాలుగు వరుసల రోడ్డు మధ్య భాగం నుంచి ఈ రోడ్డు క్రాస్‌ కానుంది. దీనికి ఇటు తుర్కపల్లి, అటు యాదాద్రి సమ దూరంలో ఉండనుంది. ఇక తుర్కపల్లికి సమీపంలోని జగదేవ్‌పూర్‌ పట్టణం రీజినల్‌ రింగురోడ్డుకు వెలుపలే ఉండనుంది. మరోవైపు గజ్వేల్‌ పట్టణం సైతం రింగురోడ్డు పరిధిలోకి రావడంలేదు. ఆ పట్టణానికి నిర్మిస్తున్న ప్రత్యేక రింగురోడ్డుకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ మార్గాన్ని కాస్త దూరంగానే నిర్మించనున్నారు.

అలాగే తూప్రాన్‌ పట్టణం రింగురోడ్డు లోపలి వైపు ఉండేలా అలైన్‌మెంట్‌ రూపొందించారు. తర్వాత నర్సాపూర్, సంగారెడ్డి పట్టణాలు కూడా రింగురోడ్డు లోపలికే ఉండబోతున్నాయి. ఈ పట్టణాలు దాటాక ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం జరుగుతుందన్నమాట. ఇటు భువనగిరి దాటిన తర్వాత వచ్చే వలిగొండ ఆర్‌ఆర్‌ఆర్‌ వెలుపలికి పరిమితం కానుండగా చౌటుప్పల్‌ మాత్రం రింగురోడ్డు లోపలివైపు ఉండనుంది. 

130 గ్రామాల వరకు గుర్తింపు? 
రీజినల్‌ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించి 85 గ్రామాల్లో భూసమీకరణ జరగనుంది. వాటిని గుర్తిస్తూ గెజిట్‌ విడుదల కానుంది. అయితే ఈ గెజిట్‌లో మరో 45 గ్రామాలను కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. నేరుగా ప్రభావితం అయ్యే గ్రామాలకు అతిచేరువగా ఉండి కనీసం ఎకరం స్థలం అయినా కోల్పోయే గ్రామాన్ని కూడా గెజిట్‌లో చేర్చాల్సి ఉంటుంది. లేనిపక్షంలో భూసమీకరణ సమయంలో గ్రామ పంచాయతీల మధ్య తేడా వస్తే ప్రత్యేకంగా అప్పటికప్పుడు మరో గెజిట్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. దీన్ని నివారించేందుకు ముందుగానే ఆయా గ్రామాలకు అతిచేరువలో ఉన్న వాటిని కూడా గుర్తించనున్నారు.   

మరిన్ని వార్తలు