RRR: తెలంగాణ రూపురేఖలు మార్చేస్తుందా?!

28 Jul, 2021 02:55 IST|Sakshi

త్వరలో ప్రారంభం కానున్న రీజినల్‌ రింగు రోడ్డు క్షేత్రస్థాయి కార్యకలాపాలు 

4 రోజుల్లో ఎన్‌హెచ్‌ఏఐతో కన్సల్టెన్సీ సంస్థ ఒప్పందం

ఆ వెంటనే రంగంలోకి.. అలైన్‌మెంటుకు తుది రూపు

దాదాపు రూ.18 వేల కోట్లకుపైగా ఖర్చు కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు కన్సల్టెన్సీ బాధ్యతలను నాగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న కే అండ్‌ జే ప్రాజెక్ట్సు ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అప్పగించింది.
ఇంతకు ముందు ప్రాథమికంగా రూపొందించిన అలైన్‌మెంటును కే అండ్‌ జే సంస్థ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. అవసరమైన మార్పులుచేర్పులతో తుది అలైన్‌మెంటును ఖరారు చేయడంతోపాటు డీపీఆర్‌ను తయారు చేస్తుంది.

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాదే కాకుండా యావత్‌ తెలంగాణ రూపురేఖలు మార్చేస్తుందని భావిస్తున్న హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు క్షేత్రస్థాయి కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అలైన్‌మెంటును ఖరారు చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థ మరో పది రోజుల్లో రంగంలోకి దిగనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ఎన్‌హెచ్‌ఏఐ గత నెలలో టెండర్లు పిలిచింది. 20 సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. చివరకు కే అండ్‌ జే సంస్థ ఎంపికైంది. ఈ సంస్థ మరో నాలుగు రోజుల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ క్షేత్రస్థాయి కార్యకలాపాలను ఆ సంస్థ ప్రారంభించనుంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. హైదరాబాద్‌లో తమ ప్రాంతీయ కార్యాలయం కూడా ప్రారంభించింది. 

అలైన్‌మెంటు ఖరారు తర్వాత డీపీఆర్‌
గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థను కన్సల్టెంటుగా నియమించారు. ఆ సంస్థ అప్పట్లో గూగుల్‌ మ్యాపు ఆధారంగా ప్రాథమిక అలైన్‌మెంటును ఖరారు చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ అక్షాంశ రేఖాంశాలను నిర్ధారించింది. ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈలోగా కన్సల్టెన్సీ గడువు తీరిపోయింది. తాజాగా కొత్త సంస్థను నియమించుకోవాల్సి రావటంతో టెండర్లు పిలిచిన ఎన్‌హెచ్‌ఏఐ నాగపూర్‌ కంపెనీని ఎంపిక చేసింది. ఈ సంస్థ తొలుత అలైన్‌మెంటును ఖరారు చేసిన తర్వాత ఏయే ప్రాంతాల్లో ఎంత భూమిని సేకరించాలో తేల్చనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేసి డీపీఆర్‌ తయారు చేయనుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు పది నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు రూ.17 వేల కోట్లు అవసరమవుతాయన్న అంచనా ఉంది. అయితే తాజా పరిస్థితుల్లో అంచనా వ్యయం వెయ్యి, రెండు వేల కోట్లు పెరగవచ్చని భావిస్తున్నారు. 

భారత్‌మాల కింద ఉత్తర భాగం
హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్‌)కు 50–70 కి.మీ. ఆవల నగరం చుట్టూ 339 (ఇందులో మార్పు ఉండొచ్చు) కి.మీ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతానికి నాలుగు వరసలుగా నిర్మించనున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తర భాగం అయిన సంగారెడ్డి– నర్సాపూర్‌– తూప్రాన్‌– గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌– జగదేవ్‌పూర్‌– యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్‌ వరకు ఉండే 164 కి.మీ. పరిధిని కేంద్రం ప్రస్తుతానికి భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది. ఈ భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లు ఖర్చవుతాయన్నది ప్రస్తుతానికి ఉన్న అంచనా. ఇక దక్షిణ భాగంలోని చౌటుప్పల్‌– ఇబ్రహీంపట్నం– కందుకూరు– ఆమన్‌గల్‌– చేవెళ్ల–శంకర్‌పల్లి–కంది–సంగారెడ్డి వరకు ఉండే మిగతా భాగం విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ మార్గంలో ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తాయో వివరాలు కావాలని కేంద్రం కోరింది. ప్రస్తుతం జాతీయ రహదారుల విభాగం దీనిపై అధ్యయనం చేసింది. దాని ఆధారంగా కేంద్రం ఈ భాగాన్ని కూడా భారత్‌మాల పరియోజనలో చేర్చనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
   

మరిన్ని వార్తలు