వరంగల్‌ జిల్లాల పునర్వ్యవస్థీకరణ

13 Aug, 2021 02:32 IST|Sakshi

కొత్తగా వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు 

పాత జిల్లాల ప్రాతిపదికనే కొనసాగనున్న జడ్పీ, మండల, గ్రామ పాలకవర్గాలు 

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు జిల్లాల సరిహద్దులతోపాటు వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల్లో మార్పులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులతోపాటు పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు ప్రభావం ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలపై, పాలకవర్గాలపై ఏమాత్రం ఉండదని స్పష్టం చేసింది. కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీల పాలక వర్గాలు కొనసాగుతాయని, పాత జిల్లాల ప్రాతిపదికనే వీటి అధికార పరిధి అమల్లో ఉంటుందని తెలిపింది. 

హన్మకొండ జిల్లా స్వరూపం...
వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని వరంగల్‌ రెవెన్యూ డివిజన్‌లోని హన్మకొండ, ఖాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వెలేర్, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, వరంగల్‌ రూరల్‌ జిల్లా.. పరకాల రెవెన్యూ డివిజన్‌లోని పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాలతో కొత్తగా హన్మకొండ జిల్లా ఏర్పాటైంది. వరంగల్‌ జిల్లా స్వరూపం..: వరంగల్‌ అర్బన్‌ జిల్లా వరంగల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని వరంగల్, ఖిలా వరంగల్, వరంగల్‌ రూరల్‌ జిల్లా.. వరంగల్‌ రూరల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని సంగెం, గీసుగొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ మండలాలతో కొత్త వరంగల్‌ జిల్లా ఏర్పాటైంది.    

మరిన్ని వార్తలు