ఒక్కరోజులో రెట్టింపు కేసులు

4 Jan, 2022 05:05 IST|Sakshi

482..  కరోనా కేసులు నమోదు

ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విజృంభణ మొదలైంది. ఒక్కసారిగా తన ప్రతాపం చూపిస్తోంది. మొన్న ఆదివారం 274 కేసులు నమోదైతే, సోమవారం ఏకంగా 482 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఆగస్టు 10న 494 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత ఇన్ని రోజులకు భారీగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 294 మంది కరోనా బారినపడ్డారు.

భారీగా కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇక రాన్రాను కేసులు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సామాజికవ్యాప్తి మొదలు కావడంతో తీవ్రత పెరిగిందని, రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటాయని చెబుతున్నారు.

వారంలో రోజుకు వెయ్యి కావచ్చు...
సోమవారం 38,362 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఏకంగా 1.25 శాతం మందికి పాజిటివ్‌ వచ్చిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. వారం రోజుల్లోగా రోజుకు వెయ్యి కేసులు నమోదయ్యే పరిస్థితి ఉండొచ్చని ఒక అధికారి వాఖ్యానించారు.

కాగా, తాజాగా ఒక రోజులో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో 4,031 మంది మరణించారు. ఒక రోజులో 212 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6.74 లక్షల మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6.82 లక్షల మంది కరోనా బారినపడ్డారు. 

ముప్పున్న దేశాల నుంచి 423 మంది రాక... 
ఒమిక్రాన్‌ ముప్పున్న దేశాల నుంచి సోమవారం 423 మంది రాగా, అందులో 23 మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. వాటితో కలిపి మొత్తం 53 ఫలితాలు రావాల్సి ఉంది. తాజాగా ఐదుగురు ఒమిక్రాన్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 37 మంది రికవరీ అయ్యారు.   

మరిన్ని వార్తలు