ఉద్యోగంలో ఉన్నట్టా.. లేనట్టా!

3 Aug, 2021 01:46 IST|Sakshi

సందిగ్ధంలో సింగరేణి కార్మికులు

ఉద్యోగ విరమణ వయసు పెంపుపై అమలుకాని సీఎం ఆదేశాలు

గోదావరిఖని (రామగుండం): సింగరేణి కార్మికుల ఉద్యోగ విరమణ వయసు పెంపు విషయంలో సందిగ్ధత నెలకొంది. కార్మికుల సర్వీసును ఏడాది పొడిగించాలని గత నెల సీఎం ఆదేశించినప్పటికీ దానికి సంబంధించి ఇప్పటికీ సర్క్యులర్‌ జారీ కాలేదు. దీంతో తమకు పొడిగింపు ఉందో లేదో అని జూలైలో పదవీ విరమణ చేసిన కార్మికులు సంశయంలో పడ్డారు. గత నెల 20న ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో సింగరేణి కార్మికుల ఉద్యోగ విరమణ వయసు ఏడాది పెంచాలని సంస్థ సీఅండ్‌ఎండీని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జూలై 26న జరిగిన సింగరేణి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం సంస్థ వ్యాప్తంగా పనిచేస్తున్న 43,899 మంది ఉద్యోగులు, అధికారులకు మరో ఏడాది రిటైర్మెంట్‌ వయస్సు పెరగనుంది. ఈ లెక్కన జూలైలో ఉద్యోగ విరమణ పొందే కార్మికుల సర్వీస్‌ మరో ఏడాది వరకు ఉంటుంది. దీనిప్రకారం సంస్థ వ్యాప్తంగా సుమారు 3 వేల మందికి లబ్ధి చేకూరనుంది. కానీ.. సీఎం ఆదేశాలిచ్చినా కంపెనీలో మాత్రం ఇంకా అవి అమలుకు నోచుకోవడం లేదు.  

జారీ కాని ఆదేశాలు.. 
ఉద్యోగ విరమణ వయస్సు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన విధివిధానాలపై సర్క్యులర్‌ మాత్రం ఇంకా జారీ కాలేదు. గత నెల 30న ఒక సర్క్యులర్‌ వచ్చినా అందులో స్పష్టమైన ఆదేశాలు లేవు. స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు డ్యూటీలోకి తీసుకోబోమని గనులపైకి వెళ్లిన కార్మికులకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. రిటైర్మెంట్‌ వయస్సు పెంపుపై సింగరేణి బోర్డు సభ్యులైన కోలిండియా డైరెక్టర్‌తో పాటు మహారాష్ట్రలోని వెస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూసీఎల్‌) ఎండీ సంతకాలు చేయకపోవడంతోనే ప్రభుత్వం అధికారికంగా సర్క్యులర్‌ జారీ చేయలేదని తెలుస్తోంది.

జూలైలో లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సింగరేణి సంస్థ వెల్లడి  
సాక్షి, హైదరాబాద్‌/గోదావరిఖని (రామగుండం):  ఈ ఏడాది జూలైలో 47.56 లక్షల టన్నుల నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 48.67 (102.34 శాతం) లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించినట్టు సింగరేణి బొగ్గు గనుల సంస్థ వెల్లడించింది. అలాగే 45.56 లక్షల టన్నుల నిర్దేశిత బొగ్గు రవాణా లక్ష్యానికి గాను 50.29 లక్షల టన్నులు (110.30శాతం) రవాణా చేసినట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది జూలైలో 28.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 70.65 శాతం వృద్ధిని సాధించినట్టు పేర్కొంది. గతేడాది జూలైలో 29.1 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేస్తే, ఈ ఏడాది జూలైలో 72.9 శాతం వృద్ధిని సాధించినట్టు తెలిపింది. గతేడాది జూలైలో 477 రేకులతో బొగ్గు రవాణా చేయగా, ఈ ఏడాది జూలైలో 91.6 శాతం వృద్ధితో 914 రేకుల ద్వారా రవాణా చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని ఐదు ఏరియాలు వంద శాతానికి మించి బొగ్గును వెలికి తీశాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 70.5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 100 శాతానికి పైగా లక్ష్యాలు సాధించడంపై సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు