ధరల పెంపుపై ప్రజామిలిటెంట్‌ పోరాటాలు

3 Apr, 2022 02:10 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధానికి ప్రజలే నాయకత్వం వహించాలి

7న విద్యుత్‌ సౌధ, పౌర సరఫరాల భవన్‌ ముట్టడిలో పాల్గొనాలి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలంతా మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రెండు ప్రభుత్వాలపై యుద్ధానికి ప్రజలే నాయకత్వం వహించాలని కోరారు. శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌ గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయ క్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, యూత్‌ కాం గ్రెస్‌ నేత అనిల్‌ యాదవ్‌లతో కలసి రేవంత్‌ మాట్లాడారు. 

‘బషీర్‌బాగ్‌’ను మించిన ఉద్యమం జరగాలి... 
సమాజంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరినీ దోచుకొనేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విద్యుత్, గ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 7న విద్యుత్‌ సౌధ, పౌర సరఫరాల కమిషనర్‌ కార్యాలయాల ముందు జరిగే ఆందోళనల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. బషీర్‌బాగ్‌ను మించిన వీరోచిత ఉద్యమం విద్యుత్‌సౌధ ముందు జరగాలని, ఇందుకు కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన ఎన్‌రోలర్స్‌ నాయకత్వం వహించాలని సూచించారు. కమ్యూనిస్టులు కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రజలపై రూ. 36 లక్షల కోట్ల భారం... 
కేంద్రంలో 2014లో యూపీఏ ప్రభుత్వం దిగిపోయే నాటికి వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 414 ఉంటే, డీజిల్‌ లీటర్‌కు రూ. 55, పెట్రోల్‌ రూ. 71గా ఉండేదన్నారు. కానీ మోదీ పాలనలో ఇప్పుడు సిలిండర్‌ ధర రూ. వెయ్యి దాటిందని, డీజిల్, పెట్రోల్‌ ధరలు రూ. 100 దాటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఈ ఎనిమిదేళ్లలో రూ. 36 లక్షల కోట్లను ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేశాయని విమర్శించారు. పేదలను దోచుకోవడంలో మోదీ, కేసీఆర్‌ అవిభక్త కవలల్లాంటి వారని అభివర్ణించారు. రాష్ట్రంలోని డిస్కంలకు రూ. వేల కోట్లు బకాయిపడ్డ ప్రభుత్వం... ప్రజలపై విద్యుత్‌ చార్జీల రూపంలో ఆ భారం మోపుతోందని చెప్పారు. 

ఆ లేఖ రాసి ఉండకపోతే... 
రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రైతుల జుట్టును కేంద్రానికి సీఎం కేసీఆర్‌ అందించారని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని సీఎం సంతకం పెట్టి కేంద్రానికి లేఖ ఇచ్చి ఉండకపోతే ఈపాటికి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అంగీ పట్టుకొని గుంజుకొచ్చే వాళ్లమని, ధాన్యం ఎందుకు కొనవని నిలదీసేవాళ్లమన్నారు.

మెడపై కత్తి పెడితే సంతకం పెట్టానని కేసీఆర్‌ చెబుతున్నారని, మరి అదే మెడపై ఎవరైనా ఏకే–47 గురిపెట్టి అడిగితే గజ్వేల్‌లోని ఫాంహౌస్‌ రాసిస్తారా? అని నిలదీశారు. ఈ విషయంలో కేసీఆర్‌ను ఉరేసినా తప్పులేదని, ఈ ప్రభుత్వాన్ని అమరవీరుల స్థూపం వద్ద రైతుల చేత రాళ్లతో కొట్టించాలని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు