Telangana Revenue Department: రెవెన్యూలో పదోన్నతులు!

5 Sep, 2022 15:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్రక్రియకు తెరలేవనుంది. ముందుగా 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించనుంది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితాను పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)ను రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఈ జాబితాను ఈ నెల 6లోగా సీసీఎల్‌ఏ ప్రభుత్వానికి సమర్పించనుండగా ఈ నెల 7 నుంచి వారి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం.

ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తూ పదోన్నతులకు అర్హులైన వారందరికీ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఎస్‌జీడీసీ) హోదా కల్పించనున్నారు. జిల్లాల విభజన అనంతరం ఏర్పాటైన తర్వాత కూడా భర్తీ కాకుండా మిగిలిపోయిన జిల్లా రెవెన్యూ అధికారుల (డీఆర్‌వో)తోపాటు నాలుగు జిల్లాల అదనపు కలెక్టర్లుగా వారికి పోస్టింగులు ఇచ్చేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. వాటితోపాటు భూసేకరణ, భూముల రక్షణ, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ విభాగాలు, న్యాయాధికారులుగా కూడా ఎస్‌జీడీసీలను నియమించే అవకాశం ఉంది. ఈ పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్లను కూడా నియమించనున్నారు. 

రెండేళ్ల కిందటే ఆదేశాలు 
వాస్తవానికి రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్ర క్రియ చాలా కాలంగా నిలిచిపోయింది. వివిధ హోదాల్లో ఉన్న 88 మంది రెవెన్యూ సిబ్బందికి 2016లో పదోన్నతులు ఇచ్చాక ఇంతవరకు ప్రమోషన్లు ఇవ్వలేదు. 2020 ఫిబ్రవరిలో 193 మంది నాయబ్‌ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పించినా మిగిలిన స్థాయిలో ఫైళ్లు కదల్లేదు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు ఇవ్వడం ప్రారంభమైనందున అర్హులైన తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, నాయబ్‌ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా, సీనియర్‌ అసిస్టెంట్లకు నాయబ్‌ తహసీల్దార్లుగా, జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు లభించనున్నాయి.

ఖాళీ అయ్యే జూనియర్‌ అసిస్టెంట్, తత్సమాన పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే అవకాశం ఏర్పడనుంది. రెవెన్యూ శాఖలో ని అన్ని స్థాయిల్లో పదోన్నతులు చేపట్టాలని రెండేళ్ల క్రితమే సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి 2020 సెప్టెంబర్‌ 12న ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో భాగంగా రెవెన్యూ సిబ్బందికి పదోన్నతులు ఇవ్వాలంటూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. కానీ అనివార్య కారణాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. 

ఎదురుచూపులకు మోక్షం 
తాజాగా డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తమ ప్రమోషన్ల కోసం ఇతర హోదాల్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది ఎదురుచూపులకు కూడా త్వరలోనే మోక్షం కలగనుంది. 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు లభిస్తే వారి స్థానంలో 120 మంది వరకు తహశీల్దార్లకు, 350 మంది వరకు నాయబ్‌తహశీల్దార్లకు పదోన్నతులు రానున్నాయి. వారి స్థానంలో ఆ మేరకు సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లు కూడా పదోన్నతులు పొందనున్నారు.

నాయబ్‌ తహసీల్దార్ల విషయానికి వస్తే 2015–16, 2016–17 ప్యానెల్‌ సంవత్సరాల్లోనే 375 మంది నాయబ్‌ తహసీల్దార్లు తహసీల్దార్లుగా పదోన్నతులు పొందేందుకు ఎంపికయ్యారు. 2017–18 సంవత్సరంలో మరో 200 మంది వరకు అర్హత పొందనున్నారు. గతంలో 193 మందికి తహసీల్దార్లుగా ప్రమోషన్లు వచ్చిన నేపథ్యంలో ఇంకా 350 మంది వరకు నాయబ్‌ తహసీల్దార్లు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు.

పదోన్నతి సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు ప్రభుత్వం ఇటీవల కుదించిన నేపథ్యంలో వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అన్ని స్థాయిలో ఈ సంఖ్య పెరుగుతుందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణ కోసం 20 మంది ఆర్డీవో (డిప్యూటీ కలెక్టర్లు)లు ఇంచార్జులుగా పనిచేస్తున్నారు. కొత్తగా తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు వస్తే వారి స్థానంలో రెగ్యులర్‌ ఆర్డీవోలను నియమించే అవకాశం ఉంది. వీటితో పాటు పలు దేవాలయాలకు ఈవోలుగా, ఇతర సంస్థల్లో, ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ అధికారులుగా కూడా వీరిని నియమించే అవకాశాలున్నాయి. 

పదోన్నతులిస్తే ఉత్సాహంగా పనిచేస్తాం 
రెవెన్యూ శాఖలో పనిభారం చాలా ఎక్కు వగా ఉంటుంది. అన్ని శాఖల్లో పదోన్నతు లు లభించినా రెవెన్యూలో కొంత ఆలస్యమైంది. ఇప్పటికి ఈ ప్రక్రియ ప్రారంభం కావడం సంతోషకరం. అన్ని స్థాయిల్లోని సిబ్బందికి వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మా వంతు ఇప్పటికే పనిచేస్తున్నాం. పదోన్నతులు కల్పిస్తే పనిభారం ఎక్కువైనా ఉత్సాహంగా పనిచేస్తాం. 
– కె. గౌతమ్‌కుమార్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   

మరిన్ని వార్తలు