తెలంగాణలో అంచనాలకు మించి అప్పులు

1 Mar, 2021 18:32 IST|Sakshi

2020–21 బడ్జెట్‌ అంచనాల్లో జనవరి నాటికి 67% చేరిన రాబడులు

ఒక్క జనవరిలోనే ఖజానాకు రూ.14,600 కోట్ల ఆదాయం

జీఎస్టీ ఆదాయంలో తగ్గుదల నమోదు

రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌ రాబడులు రూ. 2 వేల కోట్లు

కేంద్ర పన్నుల్లో వాటా ఈసారి రూ. 500 కోట్లే

వడ్డీల కింద రూ.12 వేల కోట్లకుపైగా చెల్లింపులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1.19 లక్షల కోట్లు సమకూరాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను జనవరి నాటికి 10 నెలలు పూర్తవగా మొత్తం వార్షిక బడ్జెట్‌ అంచనాలో 67 శాతం వచ్చినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాలు రూ.1.76 లక్షల కోట్లు కాగా, 10 నెలల్లో రూ.1.19 లక్షల రాబడులు వచ్చాయని తెలిపింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి వార్షిక బడ్జెట్‌ అంచనాలో 77 శాతం సమకూరడం గమనార్హం. కరోనా దెబ్బ నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకొని గాడిన పడ్డప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.40 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. 

అప్పులు రూ. 6,800 కోట్లు... ఆదాయం రూ. 7,800 కోట్లు 
ఈ ఏడాది జనవరి నాటికి రాష్ట్ర ఆర్థిక రాబడులపై ‘కాగ్‌’ వెల్లడించిన నివేదిక ప్రకారం ఒక్క నెలలో ప్రభుత్వ ఖజానాకు రూ. 14,600 కోట్ల వరకు సమకూరాయి. ఇందులో వివిధ ఆదాయ వనరుల ద్వారా రూ. 7,800 కోట్లు రాగా అప్పుల కింద ప్రభుత్వం రూ. 6,800 కోట్లు సమకూర్చుకుంది. ఆదాయ వనరులవారీగా పరిశీలిస్తే జనవరిలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం రూ. 2,600 కోట్లకే (అంతకుముందు 4 నెలల్లో రూ.3 వేల కోట్ల చొప్పున వసూలు) పరిమితమైందని, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 1,000 కోట్లు, ఎక్సైజ్‌ ఆదాయం కింద రూ. 1,000 కోట్లు రాబడులు వచ్చాయని ‘కాగ్‌’ నివేదిక వెల్లడించింది. అమ్మకం పన్ను కింద ఈ నెలలో సుమారు రూ. 2వేల కోట్లు రాగా కేంద్ర పన్నుల్లో వాటా రూ. 500 కోట్లు మాత్రమే వచ్చింది. కానీ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద డిసెంబర్‌ నాటికి రూ. 12,018 కోట్లు వచ్చాయని చెప్పిన ‘కాగ్‌’... జనవరిలో మాత్రం దాన్ని రూ. 11,764 కోట్లకు తగ్గించి చూపడం గమనార్హం.  

అప్పులు.. అంచనాలకు మించి 
ఆదాయం మాట అటుంచితే జనవరిలో అప్పుల ద్వారా ప్రభుత్వం రూ.6,800 కోట్లు సమకూర్చుకోవాల్సి వచ్చింది. దీంతో కలిపి మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పు పద్దు రూ.43,397 కోట్లకు చేరింది. అయితే ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాలో కేవలం రూ. 33,191 కోట్లు సమకూర్చుకోవాలన్నది అంచనా కాగా ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 2 నెలలు ఉండగానే అంచనాల కంటే 132 శాతం అధికంగా అప్పులు తీసుకోవాల్సి రావడం గమనార్హం. అదేవిధంగా అప్పులకు వడ్డీల కింద ఇప్పటివరకు రూ.12,735 కోట్లు చెల్లించినట్లు ‘కాగ్‌’ వెల్లడించింది. ఈ ఏడాది అప్పులకు వడ్డీల కింద రూ14,615 కోట్లు చెల్లించాలన్న ప్రభుత్వ అంచనాలో 87 శాతం ఇప్పటికే చెల్లించింది. ప్రభుత్వ ఖర్చులను పరిశీలిస్తే జనవరిలో రూ.13,400 కోట్లకుపైగా ఖర్చయ్యాయి. అదే జనవరి నాటికి మొత్తం రూ. రూ.1.10 లక్షల కోట్లకుపైగా వివిధ అవసరాల కోసం ఈ 10 నెలల్లో ప్రభుత్వం ఖర్చు చేసినట్లు ‘కాగ్‌’ లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు