ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపుపై సమీక్ష 

30 Apr, 2022 04:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపుపై శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఏమేర పెంచాలనే దిశగా అధికారులు చర్చించారు. ప్రతి మూడేళ్లకోసారి ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల పెంపుపై తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) సమీక్షిస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసి, కాలేజీల ప్రతిపాదనలు స్వీకరించింది. గడచిన మూడేళ్లలో మౌలిక వసతులు, కంప్యూటర్‌ కోర్సుల వల్ల నిర్వహణ వ్యయం పెరిగిందని ప్రైవేటు కాలేజీలు ఆడిట్‌ రిపోర్టులు సమరి్పంచాయి.

అయితే, కాలేజీలు సూచించిన స్థాయిలో ఫీజుల పెంపు సరికాదన్న వాదన ప్రభుత్వ వర్గాల నుంచి విని్పస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజులపై సలహాలు ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి నేతృత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమావేశమై ప్రాథమిక అంశాలను చర్చించింది. త్వరలో అన్ని విషయాలపైనా సమగ్రంగా చర్చించాలని నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. 

మరిన్ని వార్తలు