ధాన్యం అన్‌లోడింగ్‌కు మిల్లర్లు ఓకే

23 Apr, 2022 03:27 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల  

మంత్రి గంగులతో సమావేశంలో అంగీకారం

తమకు నష్టాలు లేకుండా చూడాలని వినతి  

సాక్షి, హైదరాబాద్‌: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌ మిల్లులకు వచ్చే యాసంగి ధాన్యాన్ని దించుకునేందుకు (అన్‌లోడింగ్‌) మిల్లర్లు అంగీకరించారు. వేసవిలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వంతో కలసి నడుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, పలువురు మిల్లర్లతో రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శుక్రవారం హైదరాబాద్‌ లోని పౌరసరఫరాల శాఖ భవన్‌లో భేటీ అయ్యారు.

కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన ధాన్యాన్ని అన్‌లోడింగ్‌ చేయడానికి మిల్లర్లు విముఖత చూపుతున్న అంశంపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రైస్‌ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాల ని కోరారు. అదే సమయంలో మిల్లర్లు రైతులను తరుగు, తాలు పేరుతో ధాన్యం కోతలతో వేధించడాన్ని మంత్రి తప్పుబట్టారు. మిల్లర్‌కు, రైతుకు మధ్య సంబంధం ఉండరాదని స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాల ప్రకారమే ధాన్యాన్ని మిల్లులకు పంపుతున్నామని, అందువల్ల ఒక్క కిలో కూడా మిల్లుల్లో కోత పెట్టరాదని ఆదేశించారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని కమిటీ యాసంగి ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ చార్జీలు నిర్ణయిస్తుందన్నారు. అలాగే రైస్‌ మిల్లర్ల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని గంగుల హామీ ఇచ్చారు.

మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం...
ఈ భేటీలో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ ధాన్యం సేకరణ, మిల్లింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్న మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికే నష్టాల్లో ఉండటం వల్ల యాసంగిలో ఎఫ్‌సీఐ కోరిన మేరకు 67 శాతం ఔటర్న్‌ రాదనే భయంతో ధాన్యం అన్‌లోడింగ్‌కు    కొందరు మిల్లర్లు భయపడుతున్నారని మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 2,400 మిల్లుల్లో 1,500కుపైగా బాయిల్డ్‌ మిల్లులున్నా యని... ఎఫ్‌సీఐ, కేంద్రం తీరుతో వాటిపై ఆధారపడి న లక్షలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొందన్నారు. రా రైస్‌ మర ఆడించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ బియ్యం వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల తమకు నష్టాలు లేకుండా చూడాలని కోరారు. భేటీలో సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్, కార్పొరేషన్‌ జీఎంలు, మిల్లర్లు పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోళ్లపై సీఎస్‌ కమిటీ భేటీ
యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం  సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శుక్రవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమావేశమైంది. ఈ భేటీలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, పౌరసరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలవారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్‌సీఐకి అందించాల్సిన ధాన్యంపై చర్చించారు. 

మరిన్ని వార్తలు