కోర్టులు ఆదేశిస్తేనే స్పందిస్తారా?

22 Sep, 2021 02:25 IST|Sakshi

డెంగీ కట్టడి చర్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: ‘న్యాయస్థానాలు ఆదేశిస్తే తప్ప ప్రభుత్వం స్పందించదా? పరిస్థితులకు అనుగుణంగా అధికార యంత్రాంగం ముందు చూపుతో వ్యవహరించదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏటా ఆదేశాలిస్తే తప్ప తగిన చర్యలు తీసుకోరా? అని నిలదీసింది. రాష్ట్రవ్యాప్తంగా దోమల నివారణకు తీసుకున్న చర్యలతోపాటు డెంగీ సహా ఇతర జ్వరాల కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని ఆదేశించింది.

ఈ మేరకు తగిన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కౌటూరి పవన్‌కుమార్, కోర్టు సహాయకారి (అమికస్‌క్యూరే), సీనియర్‌ న్యాయ వాది ఎస్‌.నిరంజన్‌రెడ్డిని ఆదేశించింది. స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా జ్వరాల బారినపడే ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ నేత రాసిన లేఖను 2019లో హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌)గా విచారణకు స్వీకరించింది.

ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌. రామచందర్‌రావు, జస్టిస్‌ టి. వినోద్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం మళ్లీ విచారించింది. రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, నెలలో 2,500 మంది డెంగీబారిన పడ్డారని న్యాయవాది పవన్‌కుమార్‌ నివేదించారు. 

కమిటీ సూచనలేంటి? 
‘రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఇతర ప్రభుత్వ విభాగాలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని 2019లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీని ఏర్పా టు చేశారా? ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు సమావేశమైంది? ఏమైనా సిఫార్సులు చేసిందా? ఈ సిఫార్సుల అమలు పురోగతి ఏమైనా ఉందా?’అని ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.

జ్వరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ సమావేశాల సమాచారం సమర్పించేందుకు కొంత గడువు ఇవ్వాలని ఏజీ అభ్యర్థించారు. గత నెలలో సీఎం కేసీఆర్‌ ఈ అంశంపై అన్ని ప్రభుత్వ విభాగాలతో సమీక్షించారని నివేదించారు. వాదనల అనంతరం  పూర్తి వివరాలను ఈనెల 29లోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు