నిజమైన ‘మహిళాబంధు’ కేసీఆర్‌ 

5 Mar, 2022 02:58 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చిత్రంలో మంత్రి సత్యవతి రాథోడ్,  ఎంపీ మాలోత్‌ కవిత,  ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి 

మహిళాబంధు సంబురాలను విజయవంతం చేయండి 

మంత్రులు సత్యవతి, సబిత పిలుపు 

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ నిర్వహించే ‘మహిళాబంధు కేసీఆర్‌’ సంబురాల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భాగస్వాములు కావాలని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. 6వ తేదీ నుంచి మూడురోజులపాటు నిర్వహించే ఈ సంబురాల్లో మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని పార్టీ నిర్ణయించిందన్నారు.

వీరు శుక్రవారం టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో కేసీఆర్‌ కిట్‌ ద్వారా 10లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని, ఆరోగ్య లక్ష్మీ పథకం కింద ఐదు లక్షల మంది మహిళలకు పోషకాహారం అందించామన్నారు. కేసీఆర్‌ పాలనలో అధికార, విపక్షాలు అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని చెప్పారు. కార్యక్రమం లో ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, ఎమ్మెల్యే బానోత్‌హరిప్రియ పాల్గొన్నారు. 

మహిళల భద్రతకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి 
మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్‌ భరోసా కేంద్రాలు, షీ టీమ్స్‌ వంటివి ఏర్పాటుచేశా రని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వడ్డీ లేని రుణాల ద్వారా రాష్ట్రంలోని 40.58 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంతోపాటు రాజకీయ రంగంలోనూ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని సబిత పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు జరిగిన కుట్రపై విచారణ జరుగుతోందని, దోషులెవరో పోలీసులు తేల్చుతారని చెప్పారు.   

మరిన్ని వార్తలు