యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఆర్టీసీ...నడిరోడ్డే బస్‌బేలుగా..

1 Jun, 2022 08:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సులు రోడ్లపై హడలెత్తిస్తున్నాయి. సిటీ, ఇతర జిల్లాలు, రాష్ట్రాల బస్సులనే తేడా లేకుండా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఇటీవల ఆ సంస్థ తీసుకున్న ‘డ్రైవర్‌ నంబర్‌’ నిర్ణయం సైతం సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ను ప్రోత్సహించేలా ఉంది. మరోపక్క నగరంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు తగ్గించే ఉద్దేశంతో పోలీసు విభాగం ప్రతిపాదించిన రూట్ల పొడిగింపు అంశాన్నీ ఆ సంస్థ పట్టించుకోవట్లేదు. 
 
నడిరోడ్లే వారికి బస్‌బేలు.. 
నగరంలో తిరిగే సిటీ బస్సుల కోసం అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా బస్టాపులు, బస్‌ బేలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఇతర వాహనాలు ఆగకుండా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది కూడా పని చేస్తుంటారు. అనేక సిటీ బస్సులు వీటిల్లో కాకుండా నడిరోడ్డుపై ఆగుతుంటాయి. ఒకేసారి అనేక బస్సులు రావడంతో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యమూ దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇటీవల ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు ఎక్కడ చెయ్యెత్తితే అక్కడ బస్సులు ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బస్టాప్‌లు, బస్‌ బేలు ఉన్న చోట మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ నడిరోడ్లపై ఆగుతున్న ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్‌ జామ్‌లకు కారణమవుతున్నాయి. 

రూట్లపై స్పందన నామమాత్రం.. 
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే ఆర్టీసీ బస్సుల గమ్యస్థానం మెహిదీపట్నంగా ఉంటోంది. ఈ రూట్లు ఇక్కడితో ముగిసిపోతుండటంతో స్థానికంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు వస్తున్నాయి. అవే ఆర్టీసీ బస్సు రూట్లు అటు షేక్‌పేట్, ఇటు అత్తాపూర్‌ వరకు ఉంటే మెహిదీపట్నం ప్రాంతంలో రద్దీ తగ్గుతుంది. రాజధానిలోని అనేక ఆర్టీసీ రూట్లు ఇలానే ఉన్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్‌ వింగ్‌ వీటి పొడిగింపుపై దృష్టి పెట్టింది. దీనికి అవసరమైన అధ్యయనంలో బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ నిపుణుల సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆర్టీసీ అధికారులను కోరింది. దీనిపైనా ఆ విభాగం నుంచి నామమాత్రపు స్పందనే వచ్చింది. అధ్యయనానికి ఏమాత్రం ఉపకరించని విధంగా ప్రతిపాదనలు పంపడం విమర్శలకు తావిస్తోంది.  

(చదవండి: పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు)

మరిన్ని వార్తలు