ఆర్టీసీ కార్గో విస్తరణకు ప్రణాళికలు 

21 Aug, 2022 02:31 IST|Sakshi

బడా సంస్థలతో ఒప్పందాలకు ఏర్పాట్లు 

కార్గో సర్వీసు పేరు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌గా మార్పు  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ పార్సిల్, కార్గో విభాగాన్ని భారీగా విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. గత కొన్ని నెలలుగా ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించటంతో ప్రస్తుతం రోజుకు 15 వేల నుంచి 18 వేల పార్సిళ్లను తరలిస్తూ రూ.25 లక్షల మేర ఆదాయాన్ని పొందుతోంది. ప్రస్తుతం దీనిని రూ.కోటికి పెంచే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారని తెలిసింది. దేశంలోని ఏ ప్రాంతానికైనా పార్సిళ్లను తరలించేలా పెద్ద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

ఇందులో తపాలా శాఖ, రైల్వేలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని బహుళజాతి కంపెనీలతో కూడా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా మంచి నెట్‌వర్క్‌ ఉంది. ఈ ప్రాంతాల్లో సరుకుల తరలింపు బాధ్యతను ఆర్టీసీ సునాయాసంగా చేపడుతుంది. ఇక రాష్ట్రం వెలుపల నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లో తాను ఆర్డర్లు తీసుకుని, పార్సిళ్ల తరలింపు ఇతర సంస్థలకు అప్పగిస్తుంది.

ఇలా ఇతర సంస్థల సహకారంతో రోజువారీ ఆదాయం రూ.కోటికి చేరేలా వ్యాపారాన్ని వృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టీఎస్‌ఆర్టీసీ కార్గో అండ్‌ పార్సిల్‌ సర్వీసుగా ఉన్న పేరును టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌గా మార్చింది. మరోవైపు  ప్రత్యేకంగా వస్తువులు తయారయ్యే ప్రాంతాల నుంచి వాటిని డోర్‌ డెలివరీ చేసే పనిపై కూడా దృష్టి సారించింది.   

లాజిస్టిక్స్‌ విభాగం బిజినెస్‌ హెడ్‌ బదిలీ.. 
ఈ విభాగం బిజినెస్‌ హెడ్‌గా ఉన్న జీవన్‌ ప్రసాద్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ బదిలీ చేశారు. ఆయనను ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్సు చీఫ్‌ ఇంజనీర్‌గా పంపించారు. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంఈ (ఓఅండ్‌పీ)గా ఉన్న పి.సంతోష్‌కుమార్‌ను ఇన్‌చార్జిగా నియమించారు.  

మరిన్ని వార్తలు