Telangana: బస్సుల్లో లగేజీ చార్జీలను భారీఎత్తున పెంచిన ఆర్టీసీ 

20 Jul, 2022 01:35 IST|Sakshi

2002 తర్వాత తొలిసారిగా చార్జీల సవరణ 

సంస్థ కార్గో సేవలతో సమానంగా పెంపు 

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ అన్నింటికీ వర్తింపు 

పాత చార్జీ రూ.1, రూ.2 స్థానంలో ఏకంగా రూ.20, రూ.50 వసూలు 

బస్సుల్లో దొడ్డిదారిన భారీగా సరుకు రవాణా 

ఆ నష్టాన్ని నివారించేందుకు చార్జీల పెంపు: ఆర్టీసీ 

50 కిలోల వరకు ఉచితమే.. 

కొత్త చార్జీలు ఈనెల 22 నుంచి అమలు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు ప్రయాణికుల లగేజీపై దృష్టి సారించింది. బస్సుల్లో తరలించే సామగ్రిపై విధించే చార్జీలను భారీఎత్తున పెంచేసింది. పల్లె వెలుగు బస్సుల్లో 25 కి.మీ. దూరానికి ఇప్పటివరకు ఉన్న రూపాయి చార్జీని ఏకంగా రూ.20కి పెంచింది. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో ఇదే దూరానికి ఉన్న రూ.2 చార్జీని రూ.50కి పెంచింది. సిటీ బస్సుల్ని కూడా వదలకుండా పాత చార్జీలతో పోల్చుకుంటే పెద్దమొత్తంలో చార్జీలు వసూలు చేయనుంది. కొత్త చార్జీలను ఈ నెల 22 నుంచే అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 

2002 నాటి చార్జీలే ఇప్పటివరకు..
బస్సుల్లో లగేజీ చార్జీలు 2002లో ఖరారు చేసినవే ఇప్పటికీ అమలవుతున్నాయి. అప్పటి నామమాత్రపు రుసుములే కొనసాగుతున్నాయి. 2002 తర్వాత పలుమార్లు టికెట్‌ చార్జీలు పెరిగినా లగేజీ చార్జీలను మాత్రం సవరించలేదు. ఇటీవల నష్టాలను పూడ్చుకునేందుకు డీజిల్‌ సెస్‌ విధింపు, ఆ వెంటనే దాని సవరింపుతో టికెట్‌ రూపంలో ఆదాయాన్ని భారీగా పెంచుకున్న ఆర్టీసీ..తాజాగా లగేజీ చార్జీలను పెంచడంతో పాటు పకడ్బందీగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంతకాలం ఇవి రూపాయి, రెండు రూపాయలు.. ఇలా మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆర్టీసీ సరుకు రవాణా (కార్గో) చార్జీలకు దాదాపు సమంగా పెంచేసింది.  

ఒక్కో బస్సులో గరిష్ట లగేజీ పరిమితి ఇలా.. 
పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ 750 కిలోలు 
సూపర్‌ లగ్జరీ 1,000 కిలోలు  

50 కిలోలు మించితే బాదుడే..
ఒక్కో ప్రయాణికుడు/ప్రయాణికురాలు తమ వెంట 50 కిలోల బరువుండే  సామగ్రిని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అంతకంటే మించి ఉండే సామగ్రిపై చార్జీలు విధిస్తారు. 25 కిలోల వరకు బరువును ఓ యూనిట్‌గా పరిగణిస్తారు. అంటే ఉచిత పరిమితికి మించి ఒక కిలో ఎక్కువున్నా సరే, దాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించి చార్జీ వడ్డిస్తారు. 25 కిలోల కంటే ఒక కిలో ఎక్కువున్నా..దాన్ని రెండో యూనిట్‌గా పరిగణించి చార్జీ విధిస్తారు. ఆ మేరకు చార్జీలు నిర్ధారించారు. పల్లె వెలుగులో అయితే ప్రతి 25 కి.మీ చొప్పున, ఎక్స్‌ప్రెస్, ఆ పై కేటగిరీలో ప్రతి 50 కి.మీ చొప్పున చార్జీ మారుతుంది. 

మూడు ప్యాకెట్‌లు మించకూడదు! 
►ప్రయాణికుడు ఉచితంగా తీసుకెళ్లే 50 కిలోల బరువు కూడా మూడు ప్యాకెట్ల (బ్యాగులు, సూట్‌కేసులు వగైరా)కు మించి ఉండకూడదు. 
►ప్రతి ప్యాకెట్‌ 20 కిలోల బరువు మించి ఉండకూడదు. ఒకవేళ ఉచిత పరిమితిలోపు ఉండే బరువు మూడు ప్యాక్‌లకు మించితే అదనపు ప్యాక్‌లపై చార్జీ విధిస్తారు.  
►ఒక్కో ప్రయాణికుడు వంద కిలోలకు మించిన బరువును తీసుకెళ్లరాదు. వంద కిలోల్లో 50 ఉచితం కాగా, మిగతాది చార్జీ పరిధిలోకి వస్తుంది.  
►చార్జీ విధించే 50 కిలోల బరువు రెండు ప్యాకెట్లలో మాత్రమే ఉండాలి. మూడో ప్యాక్‌ ఉంటే దాన్ని అదనపు యూనిట్‌గా భావించి అదనపు చార్జీ విధిస్తారు.  
►100 కిలోలకు మించి బరువు ఉంటే ప్రయాణికుల బస్సుల్లో అనుమతించరు. కార్గో బస్సుల్లోనే తరలించాలి.  

జంతువుల తరలింపు అనుమతించరు 
►బస్సుల్లో నిషేధిత వస్తువులు, అగ్ని ప్రమాదాలకు కారణమయ్యేవి, అటవీ సంబంధిత వస్తువులు, పెంపుడు జంతువులు సహా ఏ జంతువులనూ అనుమతించరు.  
►భారీ వస్తువులు, పాడయ్యే వస్తువులకు రెట్టింపు చార్జీ విధిస్తారు. ట్రక్‌ టైర్‌ను మూడు యూనిట్లుగా పరిగణిస్తారు. టీవీ, రిఫ్రిజరేటర్, సైకిల్, ఫిల్మ్‌ బాక్స్‌ (ప్యాక్డ్‌), వాషింగ్‌ మెషీన్, కార్‌ టైర్‌.. వీటిని రెండు యూనిట్లుగా పరిగణిస్తారు. 
►చాలాచోట్ల కూరగాయలు, పాలు, పండ్లను ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నారు. ఇప్పుడు అలాంటి రైతులు భారీగా చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. 

దుర్వినియోగం అరికట్టేందుకు.. 
ఆర్టీసీకి సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా కార్గో బస్సులున్నాయి. కానీ కొంతమంది కార్గో చార్జీలను తప్పించుకునేందుకు సరుకును ప్రయాణికుల బస్సుల్లో తరలిస్తున్నారు. వీటి చార్జీ నామమాత్రంగా ఉండటంతో, డ్రైవర్‌/కండక్టర్లకు కొంత మొత్తం ముట్టచెప్పి సరుకు తరలిస్తున్నారు. దీంతో ఆర్టీసీ నష్టపోతోంది. దీన్ని నివారించేందుకు ఈ చార్జీలను పెంచినట్టు ఆర్టీసీ పేర్కొంటోంది. 

మరిన్ని వార్తలు