దిగొచ్చిన ఆర్టీసీ, సీసీఎస్‌ నిధులు జమ

22 Oct, 2020 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు భయంతో ఎట్టకేలకు ఆర్టీసీ దిగి వచ్చింది. ఉద్యోగుల సహకార పరపతి సంఘం(సీసీఎస్‌) నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం రూ.50 కోట్లు జమ చేసింది. మిగతా మొత్తానికి నాలుగు వారాల గడువు ఇస్తూ తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వాటిని కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో అయోమయంగా మారిన పొదుపు సంఘం వ్యవహారం గాడిన పడే అవకాశం కనిపిస్తోంది. 

కోర్టు చెప్పాకే...
ఆర్టీసీ కార్మికులు ప్రతినెలా వేతనం నుంచి 7 శాతం మొత్తాన్ని సీసీఎస్‌కు జమ చేస్తారు. దీన్ని సంస్థనే వేతనం నుంచి మినహాయించి సీసీఎస్‌కు బదిలీ చేస్తుంది. దీంట్లోంచి కార్మికుల అవసరాలకు రుణాలు ఇచ్చేవారు. మిగతా మొత్తాన్ని పెట్టుబడి పెట్టి వడ్డీ రూపంలో ఆదాయాన్ని సీసీఎస్‌ పొందేది. కానీ, కొంతకాలంగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారటంతో ఈ నిధులను వాడేసుకుంది. దీంతో ఉద్యోగుల రుణాలు, పదవీ విరమణ పొందినవారు దాచుకున్న డబ్బుకు ఇచ్చే వడ్డీ చెల్లింపు అయోమయంలో పడింది. మృతి చెందిన కార్మికుల తాలూకు డబ్బులు చెల్లించటమూ నిలిచిపోయింది. దీంతో సీసీఎస్‌ పాలకమండలి హైకోర్టును ఆశ్రయించింది.
ఆ డబ్బులు చెల్లించాలంటూ గతేడాది సమ్మె సమయంలో కోర్టు ఆర్టీసీని ఆదేశిస్తూ గడువు విధించింది. అప్పటికి రూ.400 కోట్లు వాడేసుకుని ఉండటంతో.. అందులో రూ.200 కోట్లు ముందు చెల్లించాలని ఆదేశించింది. అయితే గడువులోపు ఈ మొత్తాన్ని చెల్లించకపోవటంతో సీసీఎస్‌ పాలకవర్గం కోర్టు ధిక్కార కేసు దాఖలు చేసింది. దీంతో మంగళవారం విచారణకు హాజరయ్యే ముందే ఆర్టీసీ రూ.50 కోట్లు సీసీఎస్‌కు చెల్లించింది. మిగతా మొత్తం చెల్లించేందుకు తమకు కొంత గడువు కావాలని కోరటంతో కోర్టు నాలుగు వారాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

ప్రతినెలా చెల్లించాల్సిందే..
ప్రతినెలా దాదాపు రూ.35 కోట్ల మొత్తాన్ని (ఇది స్థిరం కాదు) సీసీఎస్‌కు ఉద్యోగుల వేతనాల నుంచి మళ్లించాల్సి ఉంటుంది. కొంతకాలంగా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయిస్తున్నా సీసీఎస్‌లో జమ చేయడం లేదు. ఇక నుంచి ప్రతినెలా కచ్చితంగా ఆ మొత్తాన్ని సీసీఎస్‌కు బదిలీ చేయాల్సిందేనని కోర్టు ఆదేశించడం విశేషం. దీంతో ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా, గతంలో కోర్టు ఆదేశించిన మేరకు రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంది. అప్పట్లో వాడుకున్న మొత్తం డబ్బు రూ.400 కోట్లు మాత్రమే. ఇప్పుడది రూ.830 కోట్లకు చేరుకుంది. దీంతో రూ.200 కోట్లు చెల్లించాలా?, రూ.830 కోట్లు చెల్లించాలా? అన్న విషయంలో కొంత అయోమయం నెలకొంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.

చదవండి: చీటీలు వేసినవారి పనేనా! 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు