సత్తా చాటేలా సభలు

16 Aug, 2022 01:29 IST|Sakshi

నేడు వికారాబాద్‌లో .. 20న మునుగోడులో..

దూకుడు పెంచుతున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ

భారీ బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు

భారీ జన సమీకరణతో విపక్షాలకు దీటైన జవాబు

వికారాబాద్‌లో ఎమ్మెల్యేలు, మునుగోడులో ఇన్‌చార్జిలకు బాధ్యతలు

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక వాతావరణం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న సమయంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచుతోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. ఉద్యమ పార్టీకి భారీ సభల నిర్వహణ కొత్త కాకపోయినా మంగళవారం వికారాబాద్‌లో, 20న మునుగోడులో నిర్వహించే సభలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

పాదయాత్రల పేరిట ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్‌పీ, వైఎస్సార్‌టీపీ వంటి పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ దాడిని దీటుగా తిప్పికొట్టేందుకు వికారాబాద్, మునుగోడు సభలను వేదిక చేసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

మీడియా సమావేశాల్లో తరచూ ప్రధాని మోదీ పాలన వైఫల్యాలు, బీజేపీ ఎజెండాను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి చేస్తున్నా.. విపక్ష పార్టీలు క్షేత్ర స్థాయిలో కార్యకలాపాలను పెంచుతుండటంతో బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణను మొదలు పెట్టారు.

జన సమీకరణపైనే దృష్టి..
వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు జన సమీకరణ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభ ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌ (వికారాబాద్‌), పైలట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), పట్నం నరేందర్‌రెడ్డి (కొడంగల్‌), కాలే యాదయ్య (చేవెళ్ల), మహేశ్‌రెడ్డి (పరిగి) పూర్తిగా జన సమీకరణపై దృష్టి పెట్టారు.

తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నడుమ విభేదాలు ఉన్నా రెండు వర్గాలు వేర్వేరుగా జనసమీకరణపై దృష్టి పెట్టాయి. వికారాబాద్‌ కలెక్టరేట్‌ సముదాయం, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం ప్రారంభించడంతో పాటు కొత్తగా మంజూరైన మెడికల్‌ కాలేజీకి సీఎం కేసీఆర్‌ మంగళవారం శంకుస్థాపన చేస్తారు. 

మునుగోడులో మరింత దూసుకుపోయేలా..
ఇతర పార్టీలతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నిక సన్నద్ధతలో ఒక అడుగు ముందున్న టీఆర్‌ఎస్‌ ఈనెల 20న భారీ బహిరంగ సభ ద్వారా మరింత దూసుకుపోయేందుకు సన్నాహలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలకు మండలాలు, మున్సిపాలిటీల వారీగా జన సమీకరణ బాధ్యతలు అప్పగించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు బహిరంగ సభ ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు.

ఓ వైపు జనసమీకరణకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడంపై మండల, మున్సిపల్‌ ఇన్‌చార్జిలు దృష్టి సారించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 15 మందికి పైగా సర్పంచ్‌లు, పలువురు ముఖ్య కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 21న మునుగోడులో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బహిరంగ సభ నేపథ్యంలో, 20న జరిగే బహిరంగ సభ వేదికపై బీజేపీని ఇరకాటంలోకి నెట్టే రీతిలో కేసీఆర్‌ ప్రసంగం ఉంటుందని పార్టీ కీలక నేత ఒకరు వెల్లడించారు.

సభ తర్వాతే అభ్యర్థి ప్రకటన!
ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడక ముందే మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించాలని  కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ సర్వేల సంస్థల ద్వారా ఆశావహులు, వారి బలాబలాలపై ఆయన ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. టికెట్‌ ఆశిస్తున్న కంచర్ల కృష్ణారెడ్డికి అది సాధ్యం కాదనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు, పార్టీ పరంగా గుర్తింపునిస్తామని రెండురోజుల క్రితం స్వయంగా హామీ ఇచ్చారు.

గతంలో పార్టీలో చురుగ్గా పనిచేసిన వేనేపల్లి వెంకటేశ్వర్‌రావుపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేయడం ద్వారా అధినేత కేసీఆర్‌ రాజకీయ సమీకరణపై లోతుగా దృష్టి సారించారు. ఇక్కడ సభ ముగిసిన తర్వాత అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు