‘మన ఊరు–మనబడి’ పనుల వేగం పెంచాలి

9 Dec, 2022 03:44 IST|Sakshi

కలెక్టర్లకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: ‘మన ఊరు–మనబడి’తొలిదశలో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, దీనివల్ల పాఠశాలల రూపురేఖలే మారిపోతాయని స్పష్టచేశారు. ‘మన ఊరు–మన బడి’పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆమె గురువారం వీడియో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఈ నెలాఖరుకు ప్రతీ మండలంలో కనీసం రెండు పాఠశాలల్లోనైనా పనులుపూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు.

‘మన ఊరు–మన బడి’కార్యక్రమానికి రూ.7,289 కోట్లను కేటాయించామని, తొలిదశలో భాగంగా 9,123 స్కూళ్లకు 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,497 కోట్లను కేటాయించామని వెల్లడించారు. ఈ పనులకు నిధులు అందుబాటులో ఉన్నాయని, పనులను వేగవంతం చేయాలని కోరారు. పనులను పర్యవేక్షిస్తున్న ఏజెన్సీలతోను, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

డిసెంబర్‌ చివరి నాటికి 1,210 పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను కోరారు. వీటికీ డ్యూయల్‌ డెస్క్‌లను అందజేయాలని, గ్రంథాలయాలను, ఆట స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు