కొత్త టీచర్లు వచ్చే వరకు అక్కడే కొనసాగాలి

9 Feb, 2023 01:32 IST|Sakshi

అలా రాకుంటే బదిలీ అయిన టీచర్లను రిలీవ్‌ చేసేది లేదు 

మంత్రి సబిత స్పష్టీకరణ.. మండలిలో సభ్యులు 

లేవనెత్తిన అంశాలకు బదులిచ్చిన మంత్రి 

పాడి రంగానికీ ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి: జీవన్‌రెడ్డి 

ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ యువతను సన్నద్ధం చేస్తున్నాం: కవిత

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలతో పాఠశాలలు ఖాళీ అయ్యే ప్రసక్తే ఉండదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులకు స్థానచలనం జరిగి, కొత్త టీచర్లు రాని పరిస్థితి ఉన్నప్పుడు బదిలీ అయిన టీచర్లను రిలీవ్‌ చేయబోమని, కొత్త టీచర్లు వచ్చే వరకు అక్కడే కొనసాగాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. బడ్జెట్‌పై సభ్యుల ప్రసంగాల్లో భాగంగా ఉపాధ్యాయ బదిలీలపై పలు అంశాలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం జోక్యం చేసుకుంటూ జీఓ 317లో భాగంగా పలువురు ఉపాధ్యాయులకు పల్లె బడుల్లో పోస్టింగ్‌ లిచ్చారని, తాజాగా బదిలీల నిబంధనల సడలింపుతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీ అయ్యే ప్రమాదముందంటూ సూచనలు చేశారు.

దీనిపై మంత్రి పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా టీచర్‌ లేని పాఠశాలలు ఉండకూడదనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని వివరించారు. జీఓ 317 బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, జిల్లాల్లో ఖాళీల ఆధారంగా వారికి సొంత ప్రాంతాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యుడు ఏ.నర్సిరెడ్డి సూచించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతన క్రమబదీ్ధకరణ చేయాలని, కనిసీ వేతనాన్ని రూ.25వేలకు పెంచాలని కోరారు. యూనివర్సిటీల్లో నియామకాలకు సంబంధించిన బోర్డు ఏర్పాటుకు సంబంధించిన బిల్లును గవర్నర్‌ త్వరితంగా ఆమోదించాలని, దీంతో నియామకాల ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలు నిర్దేశించిన లొకేషన్లలో కాకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారని, దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా లేదని, తక్షణ చర్యలు తీసుకోవాలని మరో సభ్యుడు కె.జనార్ధన్‌రెడ్డి కోరారు. 

పాడి రైతుకూ ఉచిత కరెంట్‌ ఇవ్వాలి
వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నట్లుగానే పాడి రైతులకూ ఉచిత కరెంటు ఇవ్వాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పాడి రైతులు గడ్డికోత మెషీన్లు, ఇతరాలకు కరెంటును వినియోగిస్తుండగా... అధికారులు వాటికి చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో చాలాచోట్ల రైతాంగం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతోందని, వాటిని అరికట్టేందుకు స్టెరిలేజేషన్‌ యూనిట్లను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ రంగంలో 2,42,142 ఉద్యోగాలు కల్పించామని, ఇప్పుడు 80వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి కేంద్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, ఈ అంశంపై నిలదీస్తే రాష్ట్రాలను బదనాం చేస్తోందని ఎమ్మెల్సీ బండప్రకాశ్‌ అన్నారు. తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడే వ్యవహరిస్తోందని, కానీ కేంద్రం మాత్రం పరిధులు దాటి దేశాన్ని అప్పులపాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఇప్పటివరకు రూ.54వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇక రైతుబందు బడ్జెట్‌లో 40శాతానికిపైగా బీసీలు లబ్ధి పొందుతున్నారన్నారు. ఇతర పద్దుల్లోనూ బీసీలకు సమ వాటా అందిస్తోందని ఆయన తెలిపారు.  


   

మరిన్ని వార్తలు