BRK Bhavan: 40 నిమిషాలు లిఫ్టులోనే.. ఉక్కిరిబిక్కిరైన అధికారులు

3 Jul, 2021 08:06 IST|Sakshi
బీఆర్‌కే భవన్‌ (ఫైల్‌ ఫోటో)

తలుపులు తెరుచుకోక ఉక్కిరిబిక్కిరైన ఏడుగురు అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయంగా వినియోగిస్తున్న బీఆర్‌కేఆర్‌ బిల్డింగ్‌లో శుక్రవారం ఓ లిఫ్టు ఏడుగురు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏకంగా 40 నిమిషాల పాటు రెండు అంతస్తుల మధ్యలో నిలిచిపోవటంతో గందరగోళం నెలకొంది. అంతసేపు లిఫ్టు ఆగిపోవటంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లిఫ్టు కంపెనీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రభుత్వ కొత్త భవనాల్లో ఎక్కువగా ఇదే కంపెనీ లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారని, బీఆర్‌కేఆర్‌ భవనాన్ని సచివాలయంగా మార్చిన నేపథ్యంలో ఏడాది క్రితమే ఈ లిఫ్టు ఏర్పాటు చేశారని, ఇలాంటి నాసిరకం లిఫ్టులను ఇకపై కొత్తగా నిర్మించే భవనాల్లో అనుమతించవద్దని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది.

శంషాబాద్‌–అరాంఘర్‌ మధ్య ఆరువరుసల రోడ్డుకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి రోడ్లు, భవనాల శాఖకు చెందిన నలుగురు అధికారులు, కేంద్ర ఉపరితల రవాణా శాఖకు చెందిన ముగ్గురు అధికారులు హాజరు కావాల్సి ఉంది. సీఎస్‌ కార్యాలయానికి వెళ్లేందుకు వారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో లిఫ్టు ఎక్కారు. మొదటి–రెండో అంతస్తు మధ్యలోకి రాగానే సాంకేతిక కారణాలతో లిఫ్టు నిలిచిపోయింది.

అది ఎంతసేపటికీ పనిచేయకపోవటంతో దాదాపు 40 నిమిషాల తర్వాత బలవంతంగా తలుపులు తెరిపించి చిన్న నిచ్చెన ద్వారా లోపల ఇరుక్కున్న వారిని అతికష్టంమీద బయటకు తీశారు. సాధారణంగా సమస్యలు తలెత్తితే లిఫ్టులు తదుపరి అంతస్తుకు వెళ్లి తలుపులు తెరుచుకునే సాంకేతికత ప్రస్తుతం అందుబాటులో ఉంది. కానీ ఏడాది క్రితమే ఏర్పాటు చేసిన ఈ లిఫ్టు అలా కాకుండా మధ్యలో నిలిచిపోవటం, కొంతసేపు ఫ్యాన్‌ కూడా ఆగిపోవటంతో లోపల ఉన్న అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. 
 

మరిన్ని వార్తలు