ఊరు మునిగింది.. ఉపాధి పోయింది!

28 May, 2022 20:04 IST|Sakshi
రుద్రవరం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

ఈ చిత్రంలో ఆటోలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వారు. రుద్రవరం మధ్యమానేరు నిర్వాసిత గ్రామం. ఈ ఊరిలో ఉపాధిహామీ పనులు చూపకపోవడంతో వీరంత ఇతర గ్రామాలకు పనులకు వెళ్తున్నారు. మగవాళ్లయితే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అడ్డకూలీలుగా మారారు. ఉన్న ఊరిలోనే ఉపాధిహామీ పని చూపెట్టాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. 

సాక్షి,వేములవాడఅర్బన్‌: మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామస్తులకు ఉపాధిహామీ పని కరువైంది. గతంలో వంద రోజుల పనులు పూర్తి చేసిన వారు సైతం మధ్యమానేరు నిర్వాసిత గ్రామాలలో ఉన్నారు. అయితే వారంతా ఇప్పుడు ఇతర గ్రామాల్లో పనుల కోసం ఆటోలలో వెళ్తున్నారు. మగవారైతే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అడ్డాకూలీలుగా మారిపోయారు. మరికొందరు వాచ్‌మెన్స్, సెక్యూరిటీగార్డులుగా పనులు చూసుకుంటున్నారు. 

పని కరువైన నిర్వాసిత కాలనీలు
మిడ్‌మానేరు ముంపునకు గురైన సంకెపల్లి, ఆరెపల్లి, రుద్రవరం, అనుపురం, కొడుముంజ, శాభాష్‌పల్లి, చింతాల్‌ఠాణా, చీర్లవంచ, గుర్రవానిపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలుగా ఏర్పాటు చేశారు. ఆయా కాలనీవాసులకు ఉపాధిహామీ పనులు పెట్టడం లేదు. ఒకప్పుడు ఐదు, ఆరు ఎకరాలలో పంటలు పండిస్తూ ధర్జాగా బతికిన వీరంతా ఇప్పుడు కుటుంబ పోషణకు ఇతర గ్రామాలకు కూలీలుగా పనులకు వెళ్తున్నారు. 

పని కల్పించాలని వేడుకోలు
►మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లోని ఉపాధిహా మీ కూలీలకు జిల్లా అధికారులు స్పందించి  పనులు చూపెట్టాలని కోరుతున్నారు.  
►బ్యాక్‌ వాటర్‌ పక్కన చెరువులు, కుంటలు ఏర్పాటు చేస్తే పని దొరుకుతుందని వారు పేర్కొంటున్నారు.  
►జిల్లా అధికారులు స్పందించాలని నిర్వాసిత గ్రామాల్లోని ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉన్న వారు కోరుతున్నారు.  

గతంలో పనిచేసినం 
మేము పాత గ్రామం ఉన్నప్పుడు రోజు ఉపాధి హామీ పనికి పోయినం. పునరావాస కాలనీకి వచ్చినప్పటి నుంచి ఉపాధిహామీ పనులు లేవు. ప్రభుత్వం మాకు ఉపాధి కల్పించాలి.  
– అంగూరి స్వప్న, రుద్రవరం

పని చూపెట్టాలి 
పునరావాస కాలనీకి వచ్చినప్పటి నుంచి పనులు లేక కుటుంబపోషణ ఇబ్బందిగా మారింది. ఉపాధిహామీ పనులు లేవు, కూలి పని లేక ఇంటి వద్దనే ఉంటున్నాం. అధికారులు స్పందించి పని చూపెట్టాలి. 
– పాముల కనకవ్వ, రుద్రవరం

పనులకు వస్తలేరు 
పునరావాసకాలనీల్లోని కూలీలు ఉపాధిహామీ పనులకు ఇతర గ్రామాలకు రమ్మంటే వస్తలేరు. మారుపాక, చంద్రగిరి గ్రామాలకు ఉపాధి పనులకు తీసుకెళ్తామంటే వస్తలేరు. ఇప్పటికైనా వాళ్లు వస్తే ఉపాధిహామీ పనులు కల్పిస్తాం.
– నరేశ్‌ ఆనంద్, ఎంపీడీవో, వేములవాడ

చదవండి: Hyderabad: యువతిపై ప్రేమ.. అప్పటికే పెళ్లి నిశ్చయమైందని తెలిసి..

మరిన్ని వార్తలు