మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి 

13 Jul, 2021 23:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తనను సాంస్కృతిక సారథి చైర్మన్‌గా పునర్నియామకం చేయడంపై రసమయి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను రసమయి కలిశారు. ఉత్తర్వుల పత్రాన్ని రసమయికి సీఎం అందించారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఉద్యమంలో కష్టపడి పనిచేసిన సాంస్కృతిక కళాకారులను రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ క్రమంలోనే కళాకారులకు ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అందరికీ సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక కళాకారుల పాత్ర మరువలేనిదనీ గుర్తుచేశారు. స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర గొప్పదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరేలా సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు