ఈ ప్రభుత్వం సర్పంచ్‌లను జీతగాళ్లుగా మార్చింది  

3 Jun, 2022 02:03 IST|Sakshi

మండల సభలో అక్కన్నపేట సర్పంచ్‌ల ఆవేదన 

బిల్లులు చెల్లిస్తేనే ప్రల్లెప్రగతి చేపడతామని స్పష్టీకరణ 

నక్సలైట్లు మళ్లీ రావాలని కోరుకుంటున్నామంటూ వ్యాఖ్యలు 

అధికారుల తీరును నిరసిస్తూ సమావేశం బహిష్కరణ

అక్కన్నపేట (హుస్నాబాద్‌): గ్రామాల్లో ఇదివరకే చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలంటూ సర్పంచ్‌లు మరోసారి గళం ఎత్తారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశనాయక్‌తండా సర్పంచ్‌ బానోతు రవీందర్‌నాయక్‌ గురువారం జరిగిన పల్లెప్రగతి అవగాహన కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డిని భిక్షం వేయాలంటూ జోలె పట్టి అడగటంతో అందరూ అవాక్కయ్యారు.

ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పంచాయతీలో ట్రాక్టర్‌ కిస్తీ, కరెంట్‌ బిల్లులు, సిబ్బంది జీతాలకే సరిపోతోందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా చేపట్టాలంటూ భిక్షం అడుగుతూ ఆయన ఆవేదన వెళ్లగక్కారు. అక్కన్నపేట మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మాలోతు లక్ష్మి అధ్యక్షతన పల్లెప్రగతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రావడంలేదని, మళ్లీ పల్లెప్రగతి పనులు ఎలా చేయాలని అధికారులను నిలదీశారు.

గ్రామ అభివృద్ధి కోసం చేసిన పనులకు బిల్లులు రాక భార్య మెడలో పుస్తెలతాడు, బంగారు ఆభరణాలు తనఖా పెట్టి అప్పు కడుతున్నామంటూ ఆవేదన చెం దారు. బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని, మళ్లీ నక్సలైట్లు రా వాలని కోరుకుంటున్నామని అన్నారు. పెం డింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాకే పనులు చేస్తామని, అప్పటివరకు పల్లెప్రగతిని బహిష్కరిస్తున్నామని సర్పంచులు ముత్యాల సంజీవ్‌రెడ్డి, అన్నాడి దినేశ్‌రెడ్డి, బొమ్మగాని రాజేశం, గద్దల రమేశ్, జిల్లెల అశోక్‌రెడ్డి, కుమారస్వామి తదితరులు సృష్టం చేశారు.  

సమావేశం బహిష్కరణ.. 
సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వొద్దని పంచాయతీరాజ్‌ చట్టంలో ఏమైనా రాసి ఉందా? అని సర్పంచ్‌లు అధికారులను ప్రశ్నించారు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే సరి, లేదంటే పల్లెప్రగతి పనులు చేయబోమని సర్పంచ్‌లంతా కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ఎనిమిదేళ్ల పాలన సర్పంచ్‌లను జీతగాళ్లుగా మార్చేసిందని ఆరోపిస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

వీరంతా అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లే కావడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీంతో మాజీ జెడ్పీటీసీ మాలోతు భీలునాయక్, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు సర్పంచ్‌లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం ఎంపీపీ మాలోతు లక్ష్మి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడానికి సర్పంచ్‌లందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంగ, ఎంపీడీఓ కొప్పల సత్యపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు