Telangana: వ్యవసాయం భళా.. వృద్ధి రేటులో రెండో స్థానం

1 Oct, 2021 01:12 IST|Sakshi

6.59 శాతం వృద్ధి రేటుతో దేశంలో రెండో స్థానం సాధించిన తెలంగాణ

అనుబంధ రంగాల వృద్ధిలో ఐదో స్థానం

పది రాష్ట్రాల్లో – 3.6 శాతం నుంచి ఒక శాతం వరకే వృద్ధిరేటు

దేశంలో పదేళ్లలో వ్యవసాయరంగ పురోగతిపై విశ్లేషణ పత్రం విడుదల చేసిన నీతి ఆయోగ్‌

క్రియాశీల సాగు విధానం, నీటిపారుదల వల్లే వృద్ధి సాధ్యమైందని వెల్లడి

వరి, గోధుమ, మొక్కజొన్న పంటల వార్షిక వృద్ధి రేటు క్షీణించడంపై ఆందోళన

వ్యవసాయ వృద్ధి ప్రధానంగా క్రియాశీలక వ్యవసాయ విధానం, నీటిపారుదల సౌకర్యం, భూ సంస్కరణలు చేపట్టడం వల్లే సాధ్యమైంది. సాంకేతిక పరిజ్ఞానం కూడా  భారీ వృద్ధి రేటుకు దోహదపడింది. సరళీకృత ఆర్థిక వ్యవస్థతో కొన్ని రాష్ట్రాలు వ్యవసాయంలో  ముందుకు సాగాయి. 
– నీతి ఆయోగ్‌

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది. పదేళ్లలో వ్యవసాయ పంటల వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం దక్కించుకుంది. 6.87 శాతం వృద్ధి రేటుతో త్రిపుర ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 6.59 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. సిక్కిం కూడా ఇదే స్థానంలో ఉంది. అయితే పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణదే మొదటి స్థానమని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఉద్యానం, పాడి, పశుసంవర్థక తదితర అనుబంధ రంగాల వృద్ధి రేటులో రాష్ట్రం ఐదో స్థానంలో ఉండటం గమనార్హం. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచిందని నీతి అయోగ్‌ వెల్లడించింది.

2011–20 మధ్య కాలంలో దేశంలో వ్యవసాయ రంగ పురోగతి, వివిధ రాష్ట్రాలు సాధించిన వృద్ధిపై రూపొందించిన విశ్లేషణ పత్రాన్ని నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసింది. కేవలం 11 రాష్ట్రాల్లో మాత్రమే 3 శాతానికి మించి సగటు పంటల వృద్ధి రేటు నమోదైందని వెల్లడించింది. పది రాష్ట్రాల్లో మైనస్‌ 3.63 శాతం నుంచి ఒక శాతం లోపు వృద్ధి రేటు నమోదైంది. మరో ఎనిమిది రాష్ట్రాల్లో వృద్ధి రేటు 1.05 శాతం నుంచి 2.96 శాతం మధ్య నమోదైంది. మిగిలిన 11 రాష్ట్రాల్లో 3.38 శాతం నుంచి 6.87 శాతం నమోదైంది.

రైతు ఆదాయంలో పడిపోయిన పంటల వాటా
దేశంలో రైతు ఆదాయంలో పంటల వాటా 2011–12లో 65.4 శాతం ఉండగా, 2018–19 నాటికి అది 55.3 శాతానికి పడిపోయింది. పంచవర్ష ప్రణాళికలు మొదలైన తొలి 15 ఏళ్లలో వరి, గోధుమ, మొక్కజొన్న పంటల వార్షిక వృద్ధి రేటు 4.28 శాతం వరకు నమోదవగా గత 15 ఏళ్లలో ఆ 3 పంటల సగటు వృద్ధి రేటు 2.37 శాతానికే పరిమితమైంది. చిరుధాన్యాల వృద్ధి రేటు 2.88 శాతం నుంచి 1.94 శాతానికి తగ్గిందని, ఈ నేపథ్యంలో విధానకర్తలు మేల్కోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ హెచ్చరించింది.

మరికొన్ని ముఖ్యాంశాలు
సాగుదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యవసాయ పరిమాణం క్షీణిస్తోంది. వ్యవసాయం నుంచి కొందరు రైతులు బలవంతంగా బయటకు రావాల్సి వచ్చింది. కొందరు కూలీలుగా మారారు. పెరుగుతున్న సాగు వ్యయం. ప్రపంచ పోటీతత్వానికి అనుగుణంగా మారే పరిస్థితులు లేకపోవడమే ఇందుకు కారణం. 2001–11 మధ్యకాలంలో దేశంలో కొందరు వ్యవసాయేతర రంగంలో భాగస్వాములయ్యారు. 
ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ రైతులకు ప్ర భుత్వాల నుంచి చాలా తక్కువ సహకారం లభిస్తోంది. గ్రామీణ మహిళా కార్మికులలో 73%  మంది వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. 
గత పదేళ్లలో వ్యవసాయానికి ఇస్తున్న సబ్సిడీలు స్వల్పంగా పెరిగాయి. విద్యుత్‌ సబ్సిడీ కాకుండా చూస్తే 2011–12లో రూ. లక్ష కోట్లు సబ్సిడీ ఇవ్వగా, 2028–19లో అది రూ. 1.51 లక్షల కోట్లకు చేరింది. మత్య్సరంగానికి ఇస్తున్న సబ్సిడీ చాలా తక్కువగా ఉంటోంది. కొన్నిచోట్ల లేనేలేదు. ప్రభుత్వ భాగస్వామ్యం కరువైంది.  
కూరగాయలు, పండ్లు పండిస్తే మద్దతు ధర అందడం లేదు. దీంతో ఆయా పంటలపై రైతు లు ఆసక్తి కనబరచడం లేదు. హరిత విప్లవం వచ్చాక వ్యవసాయరంగంలో ఆధునిక పరిజ్ఞానం అమలు జరిగింది. దీంతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సంభవించాయి.  
వ్యవసాయంలో సరైన పద్ధతులు అవలంభించకపోవడం వల్ల ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడేవారు దేశంలో 15 శాతం మంది ఉన్నారు. దేశంలో 15–49 ఏళ్లవయస్సు మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు 53 శాతం మంది ఉన్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు