సచివాలయంలో ఏముంది? సీక్రసీ ఎందుకు!

27 Jul, 2020 19:34 IST|Sakshi

సెక్రెటరీయేట్ కూల్చివేత పనుల్లో అంత సీక్రసి ఏముంది? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు నిజంగానే పాత సెక్రెటరీయేట్ భవనాల కింద గుప్తనిధులున్నాయా? లేదా ఎవరు ఏమనుకుంటే మాకేంటి మేం అనుకున్నది చేసి తీరుతామనేదే ప్రభుత్వ పాలసీనా? పాత భవనాల కూల్చివేతను ప్రభుత్వం అంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం ఎందుకు? 

సాక్షి, హైదరాబాద్‌ :  పరిపాలనకు అనుకూలంగా లేదని, ఒక్కో శాఖ ఒక్కో దగ్గర ఉండడం సరైన పద్ధతి కాదని పాత సెక్రెటరీయేట్ కూల్చివేసి నూతన సెక్రెటరీయేట్ కడదామనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సంవత్సరం క్రితం నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన కేసీఆర్ వివిధ కారణాలవల్ల దాని జోలికే వెళ్ళలేదు. కేవలం వాస్తు బాగాలేదని మంచి భవనాలను కూల్చేయడం సరైంది కాదని పలువురు  కోర్టులో పిల్స్ వేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం పాత భవనాల కూల్చివేతకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రభుత్వం కూల్చివేత పనులను వేగవంతం చేసింది. కూల్చివేతల వద్దకు ఎవరిని అనుమతించకపోవడంతో పాటు మీడియా పట్ల కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

కొన్ని ప్రజాసంఘాలు, పలు పార్టీల నేతలు వివిధ కారణాలు చూపెడుతూ, కూల్చివేతను అడ్డుకొని ఆ భవనాలను కోవిడ్ సెంటర్ గా మార్చి ప్రజలకు ఉపయోగపదేవిధంగా చూడాలని కోర్టులో మళ్ళీ పిల్స్ వేశారు. కోర్టు స్టే ల తర్వాత కూల్చివేతలకు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో మీడియాకైనా అనుమతి ఇవ్వాల్సిందిగా పలువురు పిటిషన్ వేయడంతో పాత భవనాల కూల్చివేత ప్రక్రియను మీడియా కవేరేజ్ కోసం అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎస్, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో మీడియాని క్షేత్ర పర్యటనకు తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.

15 నిమిషాల్లోనే బయటకు
ఇన్ని రోజులు ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం మీడియాని అనుమతిస్తోందని తెలియడంతో వాస్తవాలు బయటకొస్తాయని అందరూ భావించారు. ప్రభుత్వం అనుమతిచ్చినా పోలీసుల కఠినమైన ఆంక్షల మధ్య మీడియాను లోపలికి తీసుకెళ్లి బయటకి తీసుకొచ్చారు. మీడియా కోసం ఐదు వెహికల్స్ ఏర్పాటు చేసి అందులోనే మీడియా ప్రతినిధులతో పాటు వందలమంది పోలీసులను కుక్కి సెక్రెటరీయేట్ కి తీసుకెళ్లారు. సెక్రెటరీయేట్ వెళ్లిన తర్వాత మీడియా ప్రతినిధులను కనీసం వాహనాల నుండి కిందకి దిగకుండా అడ్డుకొని కవరేజ్ చేయకుండా పొలీసులు నిలువరించారు.  మీడియాను పాత భవనాల కూల్చివేత దగ్గరికి మీడియాను తీసుకెళ్లిన అధికారులు కేవలం 15 నిమిషాల్లోనే బయటకి తీసుకొచ్చారు.

పాత భవనాల కవరేజీకి ఎందుకు అనుమతించడం లేదని కోర్టు అడగడంతో మాత్రమే ప్రభుత్వం మీడియాని అనుమతించిందని పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. భవనాల కూల్చివేత ప్రక్రియకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పిన ప్రభుత్వం మీడియాని ఆంక్షలు లేకుండా కవరేజీ చేసుకొనివ్వకుండా ఎందుకు వ్యవహరించిందో సమాధానం లేని ప్రశ్న. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలైతే కనిపించలేదు.కానీ కూల్చివేత పనులైతే కొనసాగుతున్నాయి. దుమ్ము లేవకుండా భవనాలను నీళ్లు కొట్టడం, పాత ఇనుప చువ్వల్లో బాగున్నవాటిని తిరిగి ఉపయోగించడం లాంటి సాధారణ ప్రక్రియ తప్పా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవీ లేవనే చెప్పుకోవాలి.
 
ఇప్పటికే 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయని చెప్తోన్న ప్రభుత్వం అక్కడి శిధిలాలను వేరే దగ్గర డంప్ చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే 2500 లారీ ట్రిప్పుల శిధిలాలు డంప్ చేశామని, మరో 2000 లారీ ట్రిప్పుల శిధిలాలను డంప్ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. బ్లాకుల పరంగా చూస్తే జీ బ్లాక్‌ను వంద శాతం కూల్చివేయగా, ఎన్‌, జే బ్లాక్‌లు యాభై శాతం కూల్చివేశారు.ఏ,బీ,సీ బ్లాక్‌లు 80 శాతం, కే బ్లాక్‌ 20 శాతం కూల్చివేశారు. ఇక సౌత్‌ హెచ్, నార్త్‌ హెచ్ బ్లాకులు 95 శాతం కూల్చివేత ముగిసింది. వృక్షాలకు ఇబ్బంది కలగకుండా కూల్చివేతలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

కూల్చివేత పనులను కవరేజీకి అనుమతించమని చెప్పుకోవడానికి మాత్రమే మీడియాను అనుమతించిన ప్రభుత్వం ఈ ప్రక్రియలో ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అనుమతించిన  ప్రతి వాహనంలో మీడియా ప్రతినిధులతో పాటు, పదుల సంఖ్యలో పోలీసులను కుక్కింది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులకు, మీడియా ప్రతినిధులకు కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యతో ఈ కమ్యూనిటీల్లో కరోనా కేసులు పెరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారో ప్రభుత్వమే చెప్పాలి.
 

>
మరిన్ని వార్తలు