ఆ నిబంధన వర్తించదు.. కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక లేనట్టే!

20 Feb, 2023 08:36 IST|Sakshi

‘ఆరు నెలల లోపు ఎన్నికలు’ నిబంధన వర్తించదు 

ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ఏడాది లోపు ముగియనుండటమే కారణం  

సాక్షి, హైదరాబాద్‌:  సాయన్న మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగే అవకాశాలు లేవు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేకపోవడమే దీనికి కారణం. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 151ఏ నిబంధన ప్రకారం.. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

అయితే, చనిపోయిన/రాజీనామా చేసిన/అనర్హత వేటు పడిన సభ్యుడి పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఈ నిబంధన వర్తించదు. శాసనసభ గడువు వచ్చే డిసెంబర్‌ 11తో ముగియనుంది. అంటే మరో 10 నెలలే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి.
చదవండి: హైదరాబాద్‌లో ఈస్ట్‌జోన్‌వైపే మధ్యతరగతి ప్రజల ఆసక్తి

మరిన్ని వార్తలు