నేర, మావో రహిత తెలంగాణే లక్ష్యం

31 Dec, 2020 01:56 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి..చిత్రంలో కమిషనర్‌ అంజనీ కుమార్‌ 

ఈ ఏడాది 6% తగ్గిన నేరాలు 

మహిళలపై పెరిగిన లైంగిక దాడులు  

29.4 నుంచి 48.5 శాతానికి పెరిగిన శిక్షలు 

ఒకే ఏడాదిలో నలుగురికి మరణశిక్ష.. అరుదైన రికార్డు 

వార్షిక నివేదిక–2020 సమావేశంలో డీజీపీ 

సాక్షి,హైదరాబాద్‌: ఈ ఏడాది రాష్ట్రంలో పలు రకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి. సైబర్‌ నేరాలు మాత్రం పెరిగాయి. నేరాల అదుపులోనూ పోలీసుల పనితీరు మెరుగైంది. నేర, మావోయిస్టు రహిత తెలంగాణే తమ లక్ష్యమని డీజీపీ డాక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాలపై బుధవారం వార్షిక నివేదిక విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

డీజీపీ ఇంకా ఏమన్నారంటే... 2020లో అనేక విపత్తులు, వరదలు, కరోనా వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల వెంట నిలిచాం. మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేశాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలలో దాదాపు 6 శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది 1,60,571 కేసులు నమోదు కాగా, 2020లో 1,50,922 కేసులు నమోదయ్యాయి. 2019లో 1,780 లైంగికదాడులు జరగ్గా 2020లో ఆ సంఖ్య 1,934కు చేరింది. ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి ఘటనాస్థలానికి కేవలం 8 నిమిషాల్లో చేరుకుంటున్నాం. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో దేశంలోనే ఇది అత్యుత్తమ సగటు. ప్రజలకు చేరవయ్యేందుకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకున్నాం. 

డీజీపీ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు ఏమిటంటే.. 

11 ఎన్‌కౌంటర్లలో 11 మంది మావోయిస్టులు హతమయ్యారు. 135 మంది అరెస్టు కాగా, 45 మంది లొంగిపోయారు. 22 ఆయుధాలు, రూ.23 లక్షల నగదు స్వాధీనం. 33 జిల్లాల తెలంగాణలో 30 జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు లేవు. 
►లాక్‌డౌన్‌ కాలంలో 6,000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వారిలో 72 మంది మరణించారు.  
►లొకేషన్‌ బేస్డ్‌ సర్వీస్‌ ద్వారా డయల్‌ 100కు ఫోన్‌ చేసిన బాధితులు ఎక్కడున్నారో కనిపెడుతున్నాం.  
►డయల్‌ 100/ డయల్‌ 112లకు 12,45,680 ఫిర్యాదులు వచ్చాయి. సోషల్‌ మీడియా కంప్లైంట్స్‌ 1,59,915, రిసెప్షన్‌ ఫిర్యాదులు 6,78,189, హాక్‌ ఐకి 1,15,743 ఫిర్యాదులు 
►ఫింగర్‌ ప్రింట్‌ టెక్నాలజీతో 300 కేసుల్లో నేరస్తుల్ని, పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో 22 మంది నేరచరితులను గుర్తించాం.  
►దర్పణ్‌ యాప్‌ ద్వారా 33 మంది పిల్లల ఆచూకీ కనుగొన్నాం  
►2020లో 624 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 350 మందిపై ప్రివెన్షన్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు 
► షీ–టీములకు 4,855 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 567 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు. 
►రాష్ట్రవ్యాప్తంగా ఆరు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేశాం. త్వరలో వీటిని ప్రతి జిల్లా/ కమిషనరేట్లలో ఏర్పాటు చేస్తాం. 
► డిపార్ట్‌మెంట్‌లో హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(హెచ్‌ఆర్‌ఎంఎస్‌) అమలుకు శ్రీకారం  
►వికారాబాద్, సంగారెడ్డి, వరంగల్‌లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం. 
►థర్డ్‌పార్టీ ద్వారా పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. 
►ఆపరేషన్‌ స్మైల్‌–6లో 1,292 మందిని, ఆపరేషన్‌ ముస్కాన్‌లో 741 మంది పిల్లలను రక్షించాం. 
►మానవ అక్రమ రవాణా ముఠాల నుంచి 383 మందిని కాపాడాం. 
►వర్టికల్‌ ఫంక్షనింగ్‌ ద్వారా 2019లో 29 శాతంగా ఉన్న కన్విక్షన్‌ రేటు 2020లో 48 శాతానికి చేరుకుంది. 
►2020లో నలుగురికి మరణశిక్ష ఖరారైంది. ఉమ్మడి ఏపీ, తెలంగాణలో ఇది ఒక రికార్డు. 
►రూ.93 కోట్ల 73 లక్షల ప్రాపర్టీ లాస్‌ అయితే రూ.50 కోట్ల 47 లక్షలు రికవరీ  
►మహిళలపై వేధింపులు గత ఏడాదితో పోలిస్తే 1.92% తగ్గింది  
►హత్యలు 8.29%, దోపిడీలు 28.57%, రాబరీ 33.11%, చైన్‌ స్నాచింగ్‌ 46% తగ్గాయి.  
►రోడ్డు ప్రమాదాలు 13.93% తగ్గాయి. మరణాలు 9% తగ్గాయి  
►వరకట్న వేధింపులు 6,544 నమోదు కాగా, అందులో 144 మంది మృతి. 
►ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ చట్టం కింద 2,096 కేసులు నమోదు. కేసుల పెరుగుదల 10.89%. 
►రాష్ట్రవ్యాప్తంగా 9,568 ఆర్థిక నేరాలు నమోదు. 4,544 సైబర్‌ నేరాలు నమోదు. గతేడాదితో పోలిస్తే 103% పెరిగాయి. 
►ఈ ఏడాది 16,866 రోడ్డు ప్రమాదాలు, 5,821 మంది మరణం. 
►ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై రూ.613 కోట్ల జరిమానాలు, మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం కోటీ 67 లక్షల కేసులు. 
►రాష్ట్రంలో 4.5 లక్షల మందికి సంబంధించి పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ చేశాం.

మరిన్ని వార్తలు