లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు ‘తెలంగాణ’ గుడ్‌న్యూస్‌

22 Jun, 2021 04:55 IST|Sakshi

సీజ్‌ చేసిన వాహనాల విడుదల

డీజీపీ ఆఫీస్‌ నుంచి ఆదేశాలు

వాహనదారుల ఫోన్లకు పోలీసుల సంక్షిప్త సందేశాలు

లాక్‌డౌన్‌ కాలంలో లక్షలాది వాహనాల జప్తు 

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధనలకు విరు ద్ధంగా బయటికి వచ్చి.. సీజ్‌ అయిన వాహనాల విడుదలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జరిమానాలు చెల్లించిన వారి వాహనాలను విడుదల చేయాలని అన్ని ఎస్పీ, పోలీస్‌ కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం నుంచి సోమవారం సర్క్యు లర్లు వెళ్లాయి. దీంతో పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలను తీసుకెళ్లేందుకు వాహనదారులకు వీలు కలిగింది. ఈ–పెట్టీ, ఈ–చలానాల జరిమానాలను చెల్లించి వాహనాలను తీసుకెళ్లవచ్చు. తీవ్రమైన వాటికి మాత్రం న్యాయస్థానం గడప తొక్కాల్సిందే. కరోనా విజృంభణతో మే నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ విధించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘ నలకు పోలీసులు ఎపిడమిక్‌ యాక్ట్‌ సెక్షన్‌ ఐపీసీ 188 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఉల్లంఘనలపై వారి సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపు తున్నారు. అందులో జరిమానాలను ఈ–చలానా, ఈ–పెట్టీ కేసుల కింద పోలీసులే విధిస్తే.. స్థానిక పోలీస్‌స్టేషన్లో చెల్లించి విడిపించుకోవచ్చు. 

చెల్లింపు ఇలా.. 
స్థానిక పోలీస్‌స్టేషన్‌ నుంచి సెల్‌ఫోన్‌కు సందేశం వస్తుంది. అందులో ఉల్లంఘనలకు జరిమానా ఎలా చెల్లించాలో కూడా పొందుపరిచారు. టీ–యాప్, టీ–వ్యాలెట్, ఈ సేవ/మీసేవ/పేటీఎం/టీఎస్‌ఆన్‌లైన్‌ లేదా https://echalan.tspolice.gov.inలో చెల్లించాలి. 

కోర్టుకు వెళితే ఇలా.. 
ఈ మొత్తంలో కొన్ని తీవ్రమైన కేసులను పోలీసులు కోర్టుకు పంపుతున్నారు. అలాంటివారు మాత్రం నేరుగా కోర్టుకు వెళ్లి అక్కడ జరిమానా చెల్లించాలి. లేకపోతే కోర్టు ప్రొసీడింగ్స్‌ ప్రకారం.. ఆ వ్యక్తిపై పోలీసులు చార్జీషీట్‌ దాఖలు చేస్తారు. దాని ఆధారంగా కోర్టు అతనికి జైలుశిక్ష ఖరారు చేస్తుంది. 

లాక్‌డౌన్‌ ఎత్తివేసినా..
ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు ఉంటాయని పోలీసు శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ఎస్పీ, కమిషనరేట్‌ కార్యాలయాలకు ఆదేశాలు అం దాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన దరిమిలా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా పూర్తిగా తొలగిపోని కారణంగా ఎపిడమిక్‌ యాక్ట్‌ కొనసాగు తుందని సోమవారం పోలీసు శాఖ స్పష్టం చేసింది. బహిరంగ, పనిచేసే ప్రాంతాల్లో మాస్కు విధిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని పునరుద్ఘాటించింది. పాటించనివారిపై ఎపిడమిక్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని, రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపింది.   

మరిన్ని వార్తలు