బాబోయ్‌.. ఈ చికెన్‌ చిక్కనంటోంది

26 Aug, 2021 09:17 IST|Sakshi

సాక్షి, పరిగి( హైదరాబాద్‌): కోడి మాసం ధరలు కొండెక్కాయి. శ్రావణమాసంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్లో కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ప్రస్తుత ధర రూ.270 పలుకుతోంది. దీంతో ముక్క గొంతు దాటని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వ్యవధిలో ధరలు రెండింతలు పెరిగాయి. దాణా రేట్లు సైతం ఇదే స్థాయిలో పెరిగాయని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. స్థానికంగా దాణా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోందని పేర్కొంటున్నారు.   

పండుగ రోజుల్లో కూడా.. 
జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 1.7 లక్షల కిలోల చికెన్‌ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఆదివారం, ఏదైనా పండగ ఉంటే ఆయా రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో కోళ్ల పెంపకం ముమ్మరంగా సాగుతోంది. కోడి పిల్లలు వేసిన 40 రోజుల్లో కోళ్లు ఎదిగి అమ్మకానికి వస్తాయి. దీంతో కోళ్ల పెంపకందారులు రెండు నెలలకో బ్యాచ్‌ తీస్తున్నారు.

ఏడాది పొడువునా చికెన్‌కు డిమాండ్‌ ఉంటున్నా.. గతంలో ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు విక్రయాలు బాగా తగ్గేవి. వరలక్ష్మీ వ్రతం, శ్రావణమాసం, వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ మాసం నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్‌ వినియోగం తగ్గుతుంది. దీంతో రేట్లు కూడా తగ్గుముఖం పడుతుంటాయి. ఈఏడాది శ్రావణమాసం ముగుస్తున్నా చికెన్‌ ధరలు మాత్రం పైపైకే వెళ్తున్నాయి. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కారణాలు ఇవే.. 
కోవిడ్‌ కారణంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో కోళ్ల దాణా ధరలు పెరిగాయి. ఆంక్షలు సడలించినా అదుపులోకి రావడం లేదు. దాణాలో ప్రధానమైన సోయాబీన్‌ అమాంతం ఎగబాకింది. గతంలో కిలో రూ.33 ఉండగా మూడు నెలలుగా రూ.100 పలుకుతోంది. మొక్కజొన్న రూ.14 నుంచి రూ.25 వరకు పెరిగిందని  కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. శ్రావణమాసం కావడంతో చాలా మంది రైతులు ఫారాల్లో కొత్త బ్యాచ్‌లు వేయలేదు. దీంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్‌ పెరిగింది. అలాగే కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. వీటి ప్రభావం ధరలపై పడుతోంది. 

చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్‌ ఆఫర్‌

మరిన్ని వార్తలు