వ్యర్థం.. ప్రయోజనమే

23 Aug, 2021 03:52 IST|Sakshi
సిద్దిపేటలో మానవ విసర్జితాల శుద్ధీకరణ యూనిట్‌. (ఇన్‌సెట్‌) మానవ విసర్జితాలనుంచి తయారైన ఎరువు

మానవ విసర్జితాలతో ఎరువు 

4 వేల కిలోల ఎరువు సిద్ధం 

సిద్దిపేట శుద్ధీకరణ ప్లాంట్‌ తొలి ఫలితం 

ఆరు నెలల్లో అద్భుతం 

సిద్దిపేట జోన్‌: జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛతలో గుర్తింపు పొందిన సిద్దిపేట మున్సిపాలిటీలో చేపట్టిన వినూత్న ప్రయోగం విజయమవంతమైంది. ఆరు నెలల క్రితం ప్రారంభమైన మానవ విసర్జితాల యూనిట్‌ నుంచి తొలి ఫలితం వచ్చింది. పట్టణంలో నివాస గృహాల సెప్టిక్‌ ట్యాంక్‌ల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధీకరణ చేసి ఎరువు తయారు చేశారు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా గత ఫిబ్రవరిలో సుమారు రూ.2 కోట్లతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు పట్టణ శివారులో ఎకరం స్థలంలో మానవ విసర్జితాల శుద్ధీకరణ యూనిట్‌ ఏర్పాటు చేశారు. పట్టణంలోని 35 వేల నివాస గృహాల నుంచి సెప్టిక్‌ ట్యాంక్‌లోని మానవ విసర్జితాల ఎఫ్‌ఎస్టీపీ (ఫికెల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)కు తరలిస్తారు.

అక్కడ అనారోబిక్‌ సేఫ్టీలైజేషన్‌ రియాక్టర్‌లో విసర్జితాలను మెథనైజేషన్‌ పద్ధతిలో శుద్ధి చేసి విసర్జితం, నీటిని వేరు చేస్తారు. నీటిని పాలిషింగ్‌ ఫండ్‌లో పాస్పరేట్, సల్ఫర్‌ ద్వారా శుద్ధిచేసి ప్యూరిఫైడ్‌ వాటర్‌గా మార్చుతారు. 18 రోజుల తర్వాత మలం ఎరువుగా మారుతుంది. ఈ ప్రక్రియ మొత్తం సాంకేతికతతో జరుగుతుంది. తొలి ఫలితం సిద్ధం: ఆరు నెలల క్రితం మొదలైన యూనిట్‌ తొలి ఫలితం నేడు సిద్ధమైంది. లక్షా 20 వేల లీటర్ల సామర్ధ్యం గల శుద్ధీకరణ ప్లాంట్‌లో ప్రతిరోజూ 20 వేల లీటర్ల విసర్జితాలు శుద్ధిచేసే అవకాశం ఉంది. గత ఆరు నెలల్లో 100కు పైగా వాహనాల ద్వారా లక్షా 60 వేల లీటర్ల మానవ విసర్జితాలను సేకరించారు. దాని నుంచి 4వేల కిలోల ఎరు వు, 16 వేల లీటర్ల శుద్ధిచేసిన నీటిని తయారు చేశా రు. నీటిని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు.

రూ.5కు కిలో చొప్పున.. 
సిద్దిపేట పట్టణంలో సెప్టిక్‌ ట్యాంక్‌ల నుంచి సేకరించిన విసర్జితాలను శుద్ధీకరణ చేసి 4 వేల కిలోల ఎరువు తయారు చేశాం. దాన్ని మున్సిపాలిటీకి రూ. 5కు కిలో చొప్పున 
విక్రయించే ఆలోచనలో ఉన్నాం. భవిష్యత్‌లో శుద్ధీకరణ లక్ష్యం మరింతగా పెంచుతాం.  
– రవికుమార్, యూనిట్‌ ఇన్‌చార్జ్‌

మరిన్ని వార్తలు